ఇక పట్టణ ప్రగతి ప్రణాళిక

3 Jan, 2020 02:40 IST|Sakshi
మోహిని కుంటలో మంత్రులు ఎర్రబెల్లి, కేటీఆర్‌ తదితరులు

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటన

మోహిని కుంటలో తాత, నానమ్మ పేరిట ఫంక్షన్‌ హాలు

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో గురువారం రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మోహినికుంటలో మంత్రులు పర్యటించి ‘పల్లె ప్రగతి’ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. పల్లె ప్రగతే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని 12,751 గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, అదే స్ఫూర్తితో రెండో విడతను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికల తర్వాత నూతన మున్సిపల్‌ పాలక వర్గాలకు శిక్షణ ఇచ్చి, పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. మోహినికుంట తమ తాత సొంత ఊరు అని, స్థలం ఇస్తే ఇక్కడ తాత, నాయనమ్మల పేరిట సొంత ఖర్చులతో ఫంక్షన్‌ హాలు నిర్మిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. మోహినికుంట వెళ్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెబితే.. ఆ ఊరి కోసం ఏదైనా మంచి పని చేయాలని సూచించారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి 
వర్ధన్నపేట: ‘మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన అన్ని విధాల సమర్థుడు. కేటీఆర్‌ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు