దశలవారీగా హాజీపూర్ అభివృద్ధి

4 Sep, 2015 23:33 IST|Sakshi
దశలవారీగా హాజీపూర్ అభివృద్ధి

- ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
యాలాల :
మండల పరిధిలోని హాజీపూర్ గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం హాజీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎంపీ నిధులతో హాజీపూర్‌లో సీసీ రోడ్లు, తాగునీటి ప్లాంటు, సైడ్ డ్రైనేజీలతో పాటు ప్రభుత్వ పాఠశాల భవనం, అంగన్‌వాడీ భవనంతో పాటు బీటీ రోడ్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు ఎక్కువగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు.

గ్రామ గేటు నుంచి గల మెటల్ రోడ్డును రూ.40 లక్షలతో బీటీ రోడ్డుగా మార్చడానికి నిధులు మంజూరయ్యాయని, పనుల నవంబర్‌లో ప్రారంభమవుతాయన్నారు. అనంతరం మండల పరిధిలోని గోరేపల్లి, దేవనూరు, రాఘవపూర్ గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  శంకిరి లక్ష్మి, డీపీఓ పద్మజారాణి, మండల మార్పు అధికారి గోపీనాథ్, టీఆర్‌ఎస్ నాయకుడు రౌతు కనకయ్య, మండల సర్పంచ్‌లు రవికుమార్, వెంకటయ్య, శివకుమార్, సాయిలు, బిచ్చన్నగౌడ్, గోపాల్, భోజిరెడ్డి, రవి తదితరులు ఉన్నారు.
 
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
గ్రామ పంచాయతీ కార్యదర్శి మోన్యానాయక్‌పై స్థానికులు ఎంపీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, కార్యదర్శి తమ గ్రామానికి వద్దని మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఎంపీ హాజీపూర్ వస్తున్నారనే అధికారిక సమాచారం ఉన్నప్పటి కీ మండల స్థాయి అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో ఆయన ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భాగ్యవర్ధన్‌కు ఫోన్  చేసి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదనే సమాధానం ఇవ్వడంతో ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు