దయలేని దవాఖానా సిబ్బంది

25 Sep, 2018 02:23 IST|Sakshi

     అర్ధరాత్రి కాన్పు చేయలేక పీహెచ్‌సీ నుంచి గర్భిణి గెంటివేత 

     స్థానికుల సాయంతో మెదక్‌ ఆస్పత్రికి తరలింపు

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రసవం కోసం వచ్చిన ఓ గిరిజన మహిళకు వైద్యం చేయడానికి ఇబ్బందిగా ఉందంటూ అర్ధరాత్రి దాటాక పీహెచ్‌సీ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీలేక గర్భిణిని తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు తమ భుజాలపై ఆమెను మోసుకుని బస్టాండ్‌ వైపు తీసుకెళ్లారు. అదే సమయంలో గణేష్‌ శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులు గమనించి గర్భిణిని మొదట స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం 108కు సమాచారం అందించి మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

సభ్యసమాజం తలదించునేలా జరిగిన ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పులింగాపూర్‌ పంచాయతీ పరిధిలోని గిరిజనతండాకు చెందిన లాలావత్‌ జ్యోతిని కుటుంబ సభ్యులు కాన్పుకోసం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాత్రి పురిటి నొప్పులు అధికమవడంతో స్టాఫ్‌నర్స్‌ కవిత కాన్పు చేయడానికి ప్రయత్నించింది.  రాత్రి 12 గంటల వరకూ ప్రసవం కాకపోవడంతో ఇక్కడి నుండి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది, గర్భిణి కుటుంబీకులకు తెలిపారు. అయితే అం త రాత్రి సమయంలో ఎక్కడికి Ððవెళ్లాలని, మీరే ఎలాగైనా కాన్పు చేయండని వేడుకున్నా  బలవంతంగా బయటకు పంపించారంటూ బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపారు. 

విచారణ చేపట్టిన అధికారులు.. 
గర్భిణిని బయటకు గెంటివేసిన ఘటనపై జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలన్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు ఆదేశాల మేరకు నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, వెల్దుర్తి ఆస్పత్రి ఇన్‌చార్జి మురళీధర్‌ సోమ వారం వెల్దుర్తి పీహెచ్‌సీని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులను అత్యవసర పరిస్థితుల్లో వేరే ఆస్పత్రికి తరలించే బాధ్యత సిబ్బందిపైనే ఉంటుందని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా పీహెచ్‌సీ వైద్యుడు రాకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  కాగా, 108 వాహనంలో మెదక్‌ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రసవం అయింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు