వ్యవసాయ వ్యర్థాలతో బయో బ్రిక్స్‌

17 Oct, 2019 13:07 IST|Sakshi

ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల సృష్టి 

కేఐఐటీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌తో కలిసి పరిశోధనలు: పీహెచ్‌డీ స్కాలర్‌ ఆర్‌. ప్రియాబ్రతా రౌత్రే

సాక్షి, సంగారెడ్డి: వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు బయో ఇటుకలు తయారు చేశారు. ఇవి పర్యావరణహితంగా, తక్కువ ఖర్చులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్‌ డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ ఆర్‌.ప్రియాబ్రతా రౌత్రే, కేఐఐటీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ భువనేశ్వర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.అవిక్‌రాయ్‌ బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. ఐఐటీ డిజైన్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌ మాథ్యూ, అ్రస్టేలియా స్విన్‌బర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ బోరిస్‌ ఐసెన్‌బార్ట్‌ మార్గ నిర్దేశకంలో ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సదస్సులో నెదర్లాండ్‌లోని టీయూ డేల్ప్‌ వద్ద (ఐసీఈడీ–1019) ప్రదర్శించారు.

వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకలను అభివృద్ధి చేసే ప్రయోగం గత కొంతకాలంగా జరుగుతోందని ఆర్‌.ప్రియాబ్రతా రౌత్రే చెప్పారు. మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బయో ఇటుకల తయారీకి 1990లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.  భారత్‌లో ఏటా 500 మిలియన్‌ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రియాబ్రతా తెలిపారు. ఈ వ్యర్థాల్లో కొంత పశుగ్రాసంగా వాడుతున్నారని, దాదాపు 84 నుంచి 141 మిలియన్‌ టన్ను లు బుడిద అవుతోందని, దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని వివరించారు. 

ప్రొఫెసర్‌ అవిక్‌రాయ్‌ మాట్లాడుతూ.. బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. కాలిన మట్టి ఇటుకల్లా ఇవి బలంగా ఉండకపోయినా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగించలేమని తెలిపారు. చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. భవనాల్లో తేమను నిరోధిస్తాయని చెప్పారు. మరింత మెరుగైన వాటిని తయారు చేసేందుకు ఇంకా పరిశోధనలు చేస్తామని, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్‌ ఇటీవల నిర్వహించిన గ్రామీణ ఇన్నొవేటర్స్‌ స్టార్ట్‌ ఆఫ్‌ కాన్‌క్లేవ్‌లో స్థిరమైన హౌజింగ్‌ కోసం ఈ బయో బ్రిక్‌ ప్రత్యేక గుర్తింపు ట్రోఫీని అందుకుందని చెప్పారు. 

‘వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్‌ ప్లాంట్‌ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తాం. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది.’ – ప్రియాబ్రతా రౌత్రే  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా