పెన్సిడిల్.. నో స్టాక్!

23 Nov, 2014 02:31 IST|Sakshi

కామారెడ్డి : దగ్గుమందు పెన్సిడిల్‌కు  కృత్రిమ కొరత ఏర్పడింది. కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు అధిక సంపాదనకు ఆశపడి పెన్సిడిల్ మందులను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌కు తరలించిన వ్యవహారంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డ్రగ్ మాఫియా తమ వద్ద స్టాక్‌ను సర్దుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కామారెడ్డిలో పెన్సిడిల్ సిరప్ కోసం మందుల దుకాణాలకు వెళితే ‘నో స్టాక్’ అనే సమాధానం వస్తోంది.

మందుల దందాలో ఆరితేరిన కొందరు వ్యాపారులు అడ్డగోలు సంపాదనకు అలవాటుపడి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారం వెలుగుచూసిం ది. ఈ విషయం బయటకు పొక్కకుం డా అక్రమ రవాణాకు పాల్పడి చిక్కిన వ్యాపారులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులను మేనేజ్ చేసినట్టు ప్రచా రం జరిగింది. అయితే సరిహద్దులు దా టిన అక్రమ దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది.

 రహస్య ప్రాంతాలకు పెన్సిడిల్ స్టాక్....
 పెన్సిడిల్‌ను భారీ మొత్తంలో తెప్పించి సరఫరా చేసే సదరు ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను రహస్య ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక రిటైల్  వ్యాపారులకు సదరు ఏజెన్సీ వారు స్టాక్ లేదని చెప్పినట్లు సమాచారం. పెన్సిడిల్ కొరత మూలంగా మందుల దుకాణాల వాళ్లు వేరే సిరప్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

 కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నాలు..
 పెన్సిడిల్ సిరప్‌ను నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు బిల్లులతో ఇతర దేశాలకు సరఫరా చేసిన వ్యవహారంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తమకున్న పలుకుబడి ద్వారా ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు