నాణేనికి మరోవైపు

7 Sep, 2019 12:11 IST|Sakshi

సిటీలో ‘ఫిలాటెలిక్‌ అండ్‌ హాబీస్‌’ ప్రదర్శన  

మొహర్‌లు, హాలీచిక్కాలు, అణాలు, రూకలు

చార్మినార్, గోల్కొండ చిత్రాలతో రూపొందించిన నాణేలు

శాతవాహనుల నుంచి నిజాం కాలం వరకు నాణేల ప్రదర్శన

హైదరాబాద్‌ ఫిలాటెలిక్, హాబీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు

మహాత్మాగాంధీ 150వ జయంతి, నిజాం నవాబుల కాలంలో విడుదల చేసిన పోస్టల్‌ స్టాంపు 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ ఫిలాటెలిక్‌ అండ్‌ హాబీస్‌ సొసైటీ ఆధ్వర్యంలోశుక్రవారం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలోని ఫ్యాప్సీ భవన్‌లో ఏర్పాటు చేసినఈ ప్రదర్శనలో ఒకప్పటి నాణేలు, కాగితపు కరెన్సీ, స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.ఆదివారం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. 

సాక్షి, సిటీబ్యూరో: చరిత్ర, పురాతన అంశాలు, మన పూర్వీకుల జీవన విధానంపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు ఫిలాటెలిక్‌ అండ్‌ హాబీస్‌ సొసైటీ నిర్వాహకులు ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 1961లో ఏర్పడిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల కొద్దీ ప్రదర్శనలు  నిర్వహించింది. పాత నాణేలు, స్టాంపులను సేకరించే అభిరుచి కలిగిన ఎంతోమందిని  ఒక వేదికమీదకు  తెచ్చింది.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాణేల సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు ఈ ప్రదర్శనలో  పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో వందల ఏళ్ల నాటి  నాణేలు, స్టాంపులను వీక్షించడమే కాకుండా  ఆసక్తి గల వారు కొనుగోలు చేయవచ్చు. ఈ నాణేలకు  రూ.20 నుంచి రూ.50 వేల వరకు కూడా డిమాండ్‌  ఉండడం గమనార్హం.

ఒక మొహర్‌ రూ.50 వేలు..
గోల్కొండ సామ్రాజ్యాన్ని  స్వాధీనం చేసుకున్న మొఘల్‌ చక్రవర్తి  ఔరంగజేబు  తన పాలనలో ప్రత్యేక ముద్ర కనబరిచాడు, ‘మొహర్‌’నాణేన్ని విడుదల చేశాడు. సుమారు 1659 నుంచి 1707 వరకు ఇది మారకంలో ఉంది. ఈ నాణెంపైన ముద్రించిన ‘ గోల్కొండ’ చిహ్నం  ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. వరంగల్‌కు చెందిన వైకుంఠాచారి ఈ  అరుదైన నాణేన్ని ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పుడు  రూ.50 వేలకు పైగా డిమాండ్‌ ఉన్నట్లు  చెప్పారు.అలాగే తొలినాటి కరెన్సీ నోట్లకు  సైతం  రూ.40 వేల నుంచి  రూ.60 వేల వరకు డిమాండ్‌ ఉంది. నాణేల సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసి భద్రపరుచుకుంటారు. పైగా అలాంటివి తమ వద్ద ఉండడం అదృష్టంగా కూడా భావిస్తారు. అలాగే ఈ ప్రదర్శనలో  నిజాం నవాబుల కాలంలో తయారు చేసిన ‘అణా’పైన ముద్రించిన చార్మినార్‌ చిహ్నం  సైతం అప్పటి పాలకుల వైభవాన్ని చాటుతుంది. దో అణా, చార్‌ అణా, ఆఠ్‌ అణాలు  ఈ ప్రదర్శనలు కనిపిస్తాయి. అణాలతో పాటు నిజాం కాలంలోనే బాగా ప్రాచూర్యంలో ఉన్న హాలిచిక్కా మరో ప్రత్యేకమైన ఆకర్షణ. చార్మినార్‌ చిహ్నంతో రూపొందించిన నాణేలు ఎక్కువగా మహబూబ్‌ అలీఖాన్, నిజాం అలీఖాన్‌ కాలానికి చెందినవే  ఉన్నాయి. వీరి కాలంలోనే కరెన్సీ నోట్లు  వినియోగంలోకి వచ్చాయి.

వైవిధ్యంగా నాణేల ముద్రణ...

వివిధ కాలాల్లో  చలామణిలో ఉన్న నాణేలు దేనికదే వైవిధ్యంగా నిలిచాయి. శాతవాహనుల నాటి  నాణేలు, కోటి లింగాల వద్ద లభించిన శాతకర్ణి కాలం నాటి స్వస్తిక్‌ చిహ్నం కలిగిన నాణెం  ఈ ప్రదర్శనలో  మరో ఆకర్షణగా  ఉంది. శాతవాహనుల కంటే ముందు గవ్వలు, చిల్లి గవ్వలు వాడులో ఉండేవి. ఆ తరువాత సత్తు బిల్లలు వినియోగంలోకి వచ్చాయి. కర్ణాటక, తెలంగాణలలో వేముల వాడ కేంద్రంగా పరిపాలించిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటి  నాణేలను కూడా  ఈ ప్రదర్శనలో  ఏర్పాటు చేశారు. ఈ నాణేల పైన ‘ గ’, ‘జ’ వంటి అక్షరాలు కనిపిస్తాయి. ఇవి ఆయా రాజుల పాలనా కాలానికి చెందిన గుర్తులు. ఇక విజయనగర రాజుల కాలంలో ప్రత్యేకించి దేవనాగరి లిపిలో తయారు చేసిన వరహాలు  ఈ  ప్రదర్శనలో  మరో ఆసక్తికరమైన  నాణెంగా  కనిపిస్తుంది. ఇటీవల ప్రభుత్వం  విడుదల చేసిన 100 రూపాయలు, 500 రూపాయల నాణేలు  కూడా  ఉన్నాయి. రూపాయి నోటు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది  కేంద్రం కొత్త నోటును విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఆర్‌బీఐ మొట్టమొదటి గవర్నర్‌ బెనెగల్‌ రామారావు సంతకంతో వెలువడిన రెండు రూపాయల నోటు ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.

స్టాంపులకూ ఓ ప్రత్యేకత ...
నిజాం కాలంలో విడుదలైన మొట్టమొదటి పోస్టల్‌ స్టాంపుతో పాటు, 1840లోనే   విడుదలైన  మొట్టమొదటి  ‘ఇంగ్లాండ్‌ పెన్నీ బ్లాక్‌’ స్టాంపు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.   1787 నుంచి 1987 వరకు అమెరికా రాజ్యాంగానికి  200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  విడుదల చేసిన స్టాంపును కూడా ఈ ప్రదర్శనలో తిలకించవచ్చు. మొత్తం 40 స్టాళ్లలో  ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆదివారం వరకు ఇది కొనసాగుతుంది.

చిన్నప్పటి నుంచి సేకరిస్తున్నా
మా నాన్న సత్యనారాయణ చారి నాణేలను సేకరించేవారు. కొన్ని వందల నాణేలను ఆయన సేకరించి పెట్టారు. ఆయనతో పాటు ఈ అభిరుచి నాకూ అలవడింది. చాళుక్యుల కాలం నుంచి ఈ నాటి వరకు అన్ని కాలాలకు చెందిన నాణేలు మా వద్ద ఉన్నాయి. విష్ణుకుండినులు, కాకతీయులు, శ్రీకృష్ణ దేవరాయలు, అసఫ్‌జాహీలు నాణేలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కరెన్సీ నోట్లపైన తొలి రోజుల్లో బ్రిటీష్‌ చిహ్నాలు చెలామణిలో ఉన్నా ఆ తరువాత  ఆ రాజుల స్థానంలో అశోక చక్రతో ముద్రించారు. ప్రతి దశలో వచ్చిన మార్పులు చాలా ఆసక్తిగానే ఉంటాయి.– వైకుంఠచారి, వరంగల్‌ 

ప్రదర్శన కోసమే ఢిల్లీ నుంచి వచ్చాను
కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్నాను. కానీ హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి వచ్చాను. నాణేల సేకరణ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు కొన్ని వందల రకాల నాణేలను సేకరించి పెట్టాను. ఎక్కడ ప్రదర్శన జరిగినా వెళ్తాను. బంగారు నాణేలకు సహజంగానే డిమాండ్‌ బాగా ఉంటుంది. కానీ ఆయా కాలాల్లో వచ్చిన కొన్ని అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లపైన   రూ.వేలల్లో డిమాండ్‌  ఉండడం చాలాఇంట్రెస్టింగ్‌.  – పృథ్వీరెడ్డి

తుగ్లక్‌ కాలం నాటి నాణెం కొన్నాను
పాతకాలం నాటి నాణేలు ఇంట్లో ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం. 20 ఏళ్లుగా సేకరిస్తున్నాను. కొన్ని నాణేలు ఉండడం అదృష్టం కూడా.  ప్రస్తుతం తుగ్లక్‌ కాలం నాటి నాణెం కొన్నాను. డబ్బు ఎంతైనా వెచ్చిస్తా.  –దుర్గ

మరిన్ని వార్తలు