సదరం సర్టిఫికెట్లు లేక వికలాంగులకు వేదన

19 Aug, 2014 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  సమగ్ర సర్వే వేల మంది వికలాంగుల పెన్షన్‌కు ఎసరు తీసుకుని వచ్చింది. సర్వేలో వికలాంగులు విధిగా సదరం సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయాలని స్పష్టంగా పేర్కొనడంతో..ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దసరా నుంచి తమకు నెలకు రూ. 500 నుంచి 1500 వచ్చే సమయంలో ఈ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల పెన్షన్లు తొలగిస్తారని భయపడుతున్నారు. సర్వే ఉద్దేశం కూడా సరైన సర్టిఫికేట్ల లేని వారిని అనర్హులుగా గుర్తించడం, అర్హులకు పెన్షన్లు ఇవ్వడమని సర్కార్ చెప్పడంతో ఏమి చేయాలో తెలియక సర్టిఫికెట్లు లేని వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు.

40% కంటే అధికంగా వైకల్యం ఉన్నప్పటికీ.. డాక్టర్లు ఈ సదరం సర్టిఫికెట్లను వికలాంగుల ఇళ్లకు ఇప్పటి వరకు పంపిం చలేదు. సదరం శిబిరాలకు వికలాంగులు వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పటికీ..ఈ సర్టిఫికెట్లను పంపిణీ చేయడంలో డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా వికలాంగులు పింఛన్లకు దూరం కావాల్సి వస్తోంది. తమతప్పు లేకపోయినా పెన్షన్ కోల్పోవడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిజిల్లాలోనూ వేలమంది వికలాంగుల పెన్షన్‌లలో కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న పెన్షనర్లలో 25 నుంచి 30 శాతానికి పైగా వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు అందలేదు. పెన్షన్ మొత్తాన్ని రూ. 1500లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భారాన్ని తగ్గించుకోవడానికి ఈ సర్టిఫికేట్లను సాకుగాచూపి వేలాది పెన్షన్లు తొలగించే యత్నం చేస్తోందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సమితి ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు, సదరం సర్టిఫికేట్లు అందనివారి వివరాలు పై విధంగా ఉన్నాయి. వీరంతా తాము సర్వేలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఎలా నమోదు చేసుకోవాలని సతమతమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు