దివ్యాంగ ఓటర్లు 10,047

13 Nov, 2018 20:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్‌: మంచిర్యాల జిల్లాలో దివ్యాంగ ఓటర్లు 10,047 మంది ఉన్నారని, పోలింగ్‌ కేంద్రాల్లో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల్లో దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గాను టోల్‌ఫ్రీ నంబర్‌ హెల్ప్‌లైన్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 18004250504 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేయవచ్చన్నారు. దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేందుకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పిస్తున్నామని, పోలింగ్‌ కేంద్రంలో వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ర్యాంపు, రెయిలింగ్‌ సౌకర్యంతో పాటు వీల్‌చైర్‌లోనే ఉండి ఓటు వేసేలా తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10,047 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్‌ పొందుతున్న వారి వివరాలు తీసుకొని వారు ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు. 

అంధులకు బ్రెయిలీ లిపిలో.. 
అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్‌ పేపర్‌ పోలింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉంచామని కలెక్టర్‌ తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌పై బ్రెయిలీ లిపిలో అంకెలు ఉంటాయని, అవసరమై చోట వారి వెంట వచ్చిన సహాయకుల సహకారంతో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌కు ఐదు రోజులు ముందు బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటరు స్లిప్, బ్రెయిలీ స్లిప్‌లు, బ్రెయిలీ ఎపిక్‌ కార్డులను అందజేస్తామన్నారు. బ్రెయిలీ ఎపిక్‌ దివ్యాంగులకు, గర్భిణులు, బాలింతలకు క్యూ ఉండదని, పోలింగ్‌ కేంద్రాల్లో వారు కూర్చోడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటరీర్లు, ఎన్‌సీసీ కెడెట్ల సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, ఇన్‌చార్జి డీఆర్డీవో శంకర్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు