వికలాంగులకు భరోసా..

30 Jun, 2018 01:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విద్య, ఉద్యోగాల్లో కోటా 4 శాతానికి పెంపు 

సంక్షేమ పథకాల్లో 5 శాతం కేటాయింపు 

గతంలో 7.. ఇప్పుడు 21 కేటగిరీలకు ధ్రువపత్రాలు 

కేంద్ర చట్టం అమలుకు రాష్ట్రం మార్గదర్శకాలు 

కోటాపై స్పష్టతనిస్తూ వరుస ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వికలాంగుల కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తోంది. 2016 డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టానికి సంబంధించి కొత్త నిబంధనలు పేర్కొంటూ వరుసగా ఉత్తర్వులిస్తోంది. విద్య, సంక్షేమ పథకాలు, డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో వికలాంగుల కోటాపై స్పష్టత ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా రంగంలో గతంలో 3 శాతం ఉన్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచింది. సంక్షేమ పథకాల్లో కచ్చితంగా 5 శాతం వికలాంగులకు కేటాయించాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీలోనూ 3 శాతం ఉన్న కోటాను 4 శాతానికి పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.  

6 నెలల్లో అన్ని రాష్ట్రాల్లో.. 
వికలాంగులకు అన్ని రకాలుగా భరోసా ఇచ్చేందుకు 2016 డిసెంబర్‌లో కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. విద్య, ఉపాధి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యం కల్పించేలా చట్టాన్ని రూపొందించి వెంటనే అమల్లోకి తెచ్చింది. పార్లమెంటు చట్టం ఆమోదం పొందిన 6 నెలల్లో అన్ని రాష్ట్రాలు అమలులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేయాలి. గడువులోపు మార్గదర్శకాలు జారీ చేయని రాష్ట్రాల్లోనూ సాంకేతికంగా కొత్త చట్టం వర్తిస్తుంది.  

20 రోజుల్లో ధ్రువీకరణ పత్రం.. 
వైకల్య నిర్ధారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసింది. దరఖాస్తు చేసుకున్న వికలాంగుడికి 20 రోజుల్లో పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా, ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో మెడికల్‌ బోర్డులు ఏర్పాటు చేసి పత్రాలు జారీ చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం 21 కేటగిరీలను దివ్యాంగుల కేటగిరీలో చేర్చింది. గతంలో 7 కేటగిరీల్లోనే వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవారు. తాజా ఉత్తర్వులతో 21 కేటగిరీలకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. యాసిడ్‌ దాడి బాధితులు, తలసేమియా, ఆటిజం, పెర్కిన్‌సన్, కండరాల క్షీణత, మందబుద్ధి, మానసిక వైకల్యం, తీవ్ర నరాల సమస్య ఉన్న వారినీ వికలాంగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు