ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి..

10 Dec, 2018 08:56 IST|Sakshi

నిమిషం వ్యవధిలోనే 1999 నోట్స్‌ వాయించిన సతీష్‌కుమార్‌

అరుదైన ఘనతను సాధించిన వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రికార్డులు సొంతం

జూబ్లీహిల్స్‌: నగరానికి చెందిన ప్రముఖ పియానిస్ట్‌ టీఎస్‌ సతీష్‌కుమార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు.    ఒక్క నిమిషం వ్యవధిలో ఏకంగా 1999 నోట్స్‌ వాయించి జాతీయ రికార్డులకెక్కారు. వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా, తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సమక్షంలో ఇటీవల నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకు సతీష్‌కుమార్‌ పేరిట ఏకంగా 31 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. కళానిధి, కళారత్న, కళా శిరోమణి సహా పలు బిరుదులు ఆయనను వరించాయి.

ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి..
సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సతీష్‌కుమార్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్‌ యూనివర్సిటీలో ఎంఫిల్‌ చేశారు. కొంతకాలం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పియానో పట్టారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ నిర్వహిస్తున్నాను. ఇక్కడ 200మంది విద్యార్థులు సంగీత పాఠాలునేర్చుకుంటున్నారు.

రికార్డుల పరంపర ఇదీ..  
లండన్‌లోని ప్రసిద్ధ ట్రినిటీ మ్యూజిక్‌ కాలేజీ నుంచి 8వ గ్రేడ్‌ సర్టిఫికెట్, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు సాధించిన తొలి భారతీయుడిగా సతీష్‌ నిలిచారు.   పియానో, ఎకోస్టిక్‌ డ్రమ్స్‌ వాయించడం ద్వారా 8వ డబుల్‌ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ సాధించారు.  భారతదేశ సంగీత స్రష్టలుగా పేరుపొందిన ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌లు కూడా సింగిల్‌ గ్రేడ్‌ మాత్రమే సాధించడం గమనార్హం.  

రెహమాన్‌ అభినందనలు మరిచిపోలేను..    
ఇప్పటికే వరల్డ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియా, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ , ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌రికార్డ్స్‌లో స్థానం సాధించా. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి వచ్చే నెల 25న డాక్టరేట్‌ అందుకోబోతున్నా. ఇప్పటికే ఇండియన్‌ జీనియస్‌ అవార్డు అందుకున్నాను.  లండన్‌కు చెందిన  హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ‘ఫాస్టెస్ట్‌ పియానిస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ సర్టిఫికెట్‌తో సత్కరించింది. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పలుమార్లు నన్ను ఫోన్‌లో అభినందించడం మర్చిపోలేని అనుభూతి.       – టీఎస్‌ సతీష్‌కుమార్, పియానిస్ట్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు