పప్పులు ఉడకవు

10 Apr, 2016 02:06 IST|Sakshi
పప్పులు ఉడకవు

చుక్కల్లో పప్పు దినుసుల ధరలు  కంది పప్పు కిలో రూ.150
పల్లి నూనె లీటర్ రూ.110
అదే బాటలో ఇతర పప్పుదినుసులు, వంట నూనె

ఆసిఫాబాద్ : ఇక ఇంట్లో పప్పులూ ఉడకని పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడమే అందుకు కారణం. జిల్లాలో పక్షం రోజుల్లోనే హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ధరలు పెరిగాయి. వారం  రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్ కందిపప్పు రూ.13,500 ఉండగా, పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ.14,500కు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో కంది పప్పు రూ.150కి విక్రయిస్తున్నారు. యేటా కందుల సీజన్ ప్రారంభంలో కంది పప్పు ధర తగ్గేది. ఈ యేడాది ప్రారంభంలో కొంత తగ్గినా, నెలరోజుల్లోనే పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి.  కిలో మినపప్పు రూ.145 ఉండగా.. రూ.165, శనగపప్పు రూ.53 ఉండగా.. రూ.66కు పెరిగాయి. దీంతోపాటు మార్కెట్‌లో పల్లి నూనె సైతం లీటర్‌కు రూ.20 పెరిగింది.

వారం రోజుల క్రితం లీటర్ పల్లి నూనె రూ.90 ఉండగా.. పెరిగిన ధరలతో రూ.110కి  చేరింది. పామాయిల్ సైతం లీటర్‌కు రూ.10 పెరిగింది. పెరుగుతున్న పప్పుల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో పప్పు దినుసుల సాగు ఏటేటా తగ్గడంతోనే పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారుు. వరి, పప్పుదినుసులకు మద్దతు ధర లభించకపోవడంతో గత పదేళ్లుగా రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కేవలం పత్తికి మాత్రమే అమలవుతుండగా, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలతో రైతులకు ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

దీంతో రైతులు పత్తి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ యేడాది ఖరీఫ్‌లో జిల్లాలో 5.40 వేల హెక్టార్లలో పత్తి, 92 వేల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో కంది, 60 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రతి యేటా జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గుతోంది. వర్షాభావంతో సాగు ఖర్చులు పెరగడంతోపాటు దిగుబడి తగ్గడంతో పప్పు దినుసుల కొరత ఏర్పడింది. దీంతో ప్రతి యేటా పప్పు దినుసులు ఇత ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర వస్తువులు,పప్పుదినుసుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భార మయ్యాయి. ప్రభుత్వం పప్పుల ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు

మరిన్ని వార్తలు