రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మారుస్తారా?

10 Aug, 2018 04:22 IST|Sakshi

సూర్యాపేట కలెక్టరేట్‌ విషయంలో దాఖలైన పిల్‌పై హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీకి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సూర్యాపేటలో పట్టణానికి దూరంగా కలెక్టరేట్‌ నిర్మాణం చేపడుతోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. పిల్‌ దాఖలు చేసిన చక్కిలం రాజేశ్వరరావు తాను ఓ జాతీయ పార్టీకి చెందిన వ్యక్తినని, ఆ పార్టీ అధికార ప్రతినిధినని ఎక్కడా చెప్పకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చడం ఎంత మాత్రం తగదని హితవు పలికింది. బ్యాలెట్‌ ద్వారా చేయాల్సిన యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం మంచిది కాదని సూచించింది. ఈ వ్యాజ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారని, దీంతో ఈ పిల్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని వ్యాఖ్యానించింది. కలెక్టరేట్‌ నిర్మించతలపెట్టిన భూమి పక్కనే మునిసిపల్‌ చైర్మన్‌ భర్త భూమి కొన్నారని, ఈ భూములకు రేట్లు పెరిగేలా చేసేందుకే ప్రభుత్వం అక్కడ కలెక్టరేట్‌ను నిర్మిస్తోందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

సూర్యాపేట జిల్లా ఏర్పడటానికి ముందే అక్కడ మునిసిపల్‌ చైర్మన్‌ భర్త శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో భూమి కొన్నారని గుర్తు చేసింది. కలెక్టరేట్‌ నిర్మాణం కోసం అవసరమైన మొత్తం 25 ఎకరాల భూమిలో ప్రభుత్వం మునిసిపల్‌ చైర్మన్‌ భర్తకు చెందిన శ్రీసాయి డెవలపర్స్‌ నుంచి 8 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన భూమిని ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.  

దురుద్దేశాలు అంటగట్టడం సరికాదు..
సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా.. పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, అందులో కలెక్టరేట్‌ నిర్మించాలని నిర్ణయించిందని ఆరోపిస్తూ సీహెచ్‌.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే పట్టణానికి దూరంగా కలెక్టరేట్‌ను ప్రైవేటు భూముల్లో నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కలెక్టరేట్‌ నిర్మాణం చేస్తున్న భూమి పక్కనే మునిసిపల్‌ చైర్మన్‌ భర్త భూములున్నాయన్న కారణంతో ప్రభుత్వ జీవోకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదన్న శ్రీసాయి డెవలపర్స్‌ తరఫు న్యాయవాది పి.శ్రీహర్ష వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. సూర్యపేట కలెక్టరేట్‌ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని చెప్పలేమని తేల్చి చెప్పింది.

మరిన్ని వార్తలు