సభకు చెప్పకుండా అసెంబ్లీ రద్దు చేయొచ్చా?

6 Oct, 2018 02:51 IST|Sakshi

వివరాలను మా ముందుంచండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషన్‌

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పత్రికలు చూసి ఈ విషయం తెలుసుకున్నారు

హైకోర్టుకు నివేదించిన పిటిషనర్లు..

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావుకు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికల కోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్‌.అభిలాష్‌రెడ్డిలు హైకోర్టులో  పిల్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది పి.నిరూప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఓటుహక్కు నమోదు గడువును ఎన్నికల సంఘం కుదించిందని, ఫలితంగా రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం పోయిందని, తద్వారా వారు ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని వివరించారు.

2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ షెడ్యూల్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2019 జనవరి 1 గడువును 2018 జనవరి 1గా కుదిస్తూ గత నెల 8న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారని, దీనిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇలా ఓటు హక్కును హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఏ యువత వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ఇప్పుడు ఆ యువతకే ఓటుహక్కు లేకుండా పోయిందని చెప్పారు.

రద్దుపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి...
అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేసిందని, దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారని నిరూప్‌రెడ్డి వివరించారు. వాస్తవానికి అసెంబ్లీని రద్దు చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని సభకు తెలియజేసి, ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజాభీష్టం మేరకే ఎన్నికయ్యారని, అసెంబ్లీ రద్దు విషయం వారికి పత్రికల్లో చూస్తే గాని తెలియలేదని వివరించారు. 

ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో సభకు కారణాలు తెలియచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టంచేశారు. సాధారణ ఎన్నికలప్పుడు రెండు అసెంబ్లీలకు మధ్య ఆరు నెలల వ్యవధి ఉండాలని, కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఆరు నెలల వ్యవధి అవసరం లేదని, కాబట్టి ఇంత హడావుడిగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదని నివేదించారు.

2014 ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 63 మంది గెలిచారని, ఆ తరువాత ఇది 90కి చేరిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లే అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈ పాయింట్‌ను ఇప్పటి వరకు ఎవ్వరూ లేవనెత్తలేదు. ఇది ఓ విస్తృత అంశం. దీనిని భిన్న కోణంలో చూడాలి. కాబట్టి ఈ అంశంపై మేం పూర్తిస్థాయిలో వాదనలు వింటాం’ అని స్పష్టం చేసింది.


జాతకాలను తేల్చేది ఆ 10 శాతం మందే
నిరూప్‌రెడ్డి తన వాదనలను కొనసాగిస్తూ.. తెలంగాణలో మొత్తం 2.81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల దాదాపు 10 శాతం మంది ఓటుహక్కు కోల్పోయారని, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల జాతకాలను ఈ 10 శాతం మంది ఓటర్లే తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తప్పులన్నీ సవరించి ఓటర్ల జాబితాను తయారుచేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టం ఏమీలేదని పేర్కొన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం.. శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీ రద్దుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ రామచంద్రరావును ఆదేశించింది. ఇది ప్రధాన అంశమని, దీనిని తేల్చిన తర్వాతే ఓటర్ల చేర్పులు, తీసివేతలు, జాబితాల తయారీ విషయానికొస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు