సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపుపై పిల్‌

22 Jun, 2019 03:40 IST|Sakshi

కౌంటర్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో రూ.500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని సాయిసింధు ఫౌండేషన్‌కు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ వేయాలని ఆదేశించింది.

ఫౌండేషన్‌కు భూమిని కేటాయిస్తూ 2018 మార్చి 22న జారీ చేసిన జీవో 59, ఆగస్టులో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లను రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన ఉర్మిళా పింగ్లేతోపాటు పలువురు  పిల్‌  వేశారు. దీనిని శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం విచారించింది.పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు మరో నాలుగు వారాల సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ భూకేటాయింపులు చట్ట వ్యతిరేకమని తేలితే నిర్మాణాల్ని కూల్చివేసేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చంది. కౌంటర్‌ దాఖలుకు  రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.    

మరిన్ని వార్తలు