ఓటర్ల సవరణ గడువు కుదింపుపై ‘పిల్‌’

18 Sep, 2018 02:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ గడువును తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్ర యోజన వ్యాజ్యం దాఖలైంది. అక్టోబర్‌ లేదా నవంబర్‌ మాసాల్లో ఎన్నికలు జరపాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేసిన కారణంగా ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించారంటూ న్యాయవాది కొమ్మిరెడ్డి కృష్ణ విజయ్‌ అజాద్‌ ‘పిల్‌’వేశారు.

ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర న్యాయశాఖ, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఓటర్ల జాబితాల సవరణకు 2019 జనవరి వరకూ గడువు ఉంటే 2018 జనవరి నాటికి తగ్గించేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నెల 8న నోటిఫికేషన్‌ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు.   2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో 2.81 కోట్ల ఓటర్లు ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న వెల్లడించిన ముసాయిదా జాబితాలో 21 లక్షల ఓట్లు తగ్గి పోయాయన్నారు.

మరిన్ని వార్తలు