అమ్మా... భయమేస్తోంది!

12 Nov, 2018 03:15 IST|Sakshi

పాఠశాలల్లో చిన్నారులపై అఘాయిత్యాలు..

డీఈఓ, డీఎస్‌ఈలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు శూన్యం 

స్కూళ్లలో జరుగుతున్న ఘటనలపై హైకోర్టులో పిల్‌..

ఉరుకులు పరుగులు పెడుతున్న పాఠశాల విద్యాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలల్లో బాలికలు ‘బలి’అవుతున్నారు. విద్యను నేర్చుకునే చోటే ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లలో చిన్నారులపై వేధింపులు, దాడులు, అసభ్య ప్రవర్తన పెరిగిపోతోంది. వేధింపులే అయినా వాటిని గుర్తించలేక, గుర్తించినా భయపడి చెప్పుకోలేక వారు మానసికంగా కుంగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు గుర్తించేలోపే పరిస్థితి చేయిదాటిపోతోంది. ముందుగానే గుర్తించి రక్షించాల్సిన వ్యవస్థలు ఎక్కడా ఏర్పాటు కాకపోవడంతో భవిష్యత్‌ తరాలు భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గత 3 నెలల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు ఇరవై వరకు ఘటనలు చోటుచేసుకున్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు ఫిర్యాదులు రానివే కావడం గమనార్హం.

ఈ క్రమంలో పాఠశాలల్లో జరుగుతున్న ఘటనలపై ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్‌ వేయడంతో విద్యాశాఖలో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. వేధింపులు, దాడులను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించాలని కోర్టు స్పష్టం చేయడంతో ఆ శాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘటనలపై వివరాలు సమర్పించాలని డీఈఓలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు పత్రికల్లో వచ్చిన వార్తలను సైతం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రత్యేక సెల్‌ ఎక్కడ..? 
పాఠశాలల్లో చిన్నారులు, బాలికల పట్ల ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు జిల్లా విద్యాధికారి, రాష్ట్ర కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. అసభ్య ప్రవర్తన, వేధింపులు చోటుచేసుకున్నప్పుడు స్థానిక మండల విద్యాధికారికో లేక జిల్లా విద్యాశాఖ అధికారికో ఫిర్యాదు చేయడంతోనే సరిపెడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో బాలల పరిరక్షణ సెల్‌కే వేధింపుల ఫిర్యాదులు తీసుకునే బాధ్యతలను కూడా అప్పగించారు. పాఠశాలలో చిన్నారుల పట్ల వేధింపులు, అసభ్య ప్రవర్తన లాంటి ఘటనలు జరిగిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి... ఫిర్యాదుల స్వీకరణ సులభతరం చేయాలని, ఈ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు.. 
- బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలిక పట్ల ఆ స్కూల్‌ శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదే పాఠశాలలో ఈ ఏడాది ఆగస్టులో మూడో తరగతి చదువుతున్న బాలిక విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 
ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఓ ప్రఖ్యాత పాఠశాలలో ఎనిమిదో తరగతి బాలిక వేధింపులకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
శేరిలింగంపల్లిలోని ఓ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చినట్లు తేలడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి సమీపంలోని ఓ పాఠశాలలోనూ ఇదే తరహాలో బాలిక గర్భవతి కావడంతో ప్రిన్సిపాల్‌పై వేటు వేశారు.  

మరిన్ని వార్తలు