లేజర్‌ వెలుగులతో పైలట్‌ షాక్‌!

19 Mar, 2019 04:22 IST|Sakshi
ఫంక్షన్‌హాళ్లకు అధికారుల హెచ్చరిక నోటీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్‌కు కష్టాలు

విమానాశ్రయం సమీపంలో డీజే, లేజర్‌ లైట్లతో బర్త్‌డే పార్టీ

పైలట్‌ ఫిర్యాదుతో కదిలిన అధికారులు

శంషాబాద్‌: మరికొద్ది క్షణాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ చేయాల్సి ఉండగా.. రన్‌వే సమీపంలో ప్రసరిస్తున్న లేజర్‌ లైట్ల కారణంగా పైలట్‌ ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీంతో విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు అతడు అష్టకష్టాలు పడ్డాడు. సౌదీ నుంచి వచ్చిన ఆ విమానం రన్‌వేపై దిగబోతుండగా లేజర్‌ కిరణాలు అడ్డు తగిలాయి. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శంషాబాద్‌ మండల పరిధిలోని ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఉన్న రషీద్‌గూడ గ్రామ పరిధిలోని చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు స్నేహితులతో కలసి డీజేతో పాటు లేజర్‌ షాట్స్, లేజర్‌ లైట్ల వెలుగుల మధ్య పార్టీ చేసుకున్నారు. ఇదే సమయంలో సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయబోతుండగా లేజర్‌ కిరణాల కారణంగా పైలట్‌ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయమై ఆయన ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు.

15 కి.మీ. పరిధిలో ఆంక్షలు..
ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాలతో హెచ్‌ఎండీఏ, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. రషీద్‌గూడ సమీపంలోని చెరువుకట్ట వద్ద యువకులు పార్టీ చేసుకున్న విషయం తెలుసుకుని సోమవారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చుట్టూ 15 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా లేజర్‌ షాట్స్, లేజర్‌ లైట్లను ఉపయోగించకూడదని, అలాగే బాణసంచా కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ పరిధిలోని అన్ని ఫంక్షన్‌ హాళ్లకు నోటీసులు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు