ఎంపీటీసీగా గెలిచిన పైలట్‌

5 Jun, 2019 06:53 IST|Sakshi
గెలుపు ధ్రువీకరణ పత్రంతో గుర్రం ఆనంద్‌రెడ్డి

శంషాబాద్‌ రూరల్‌: ఓ పైలట్‌.. ప్రజా సేవ కోసం ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. శంషాబాద్‌ మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్‌రెడ్డి  బీటెక్‌ తర్వాత పైలట్‌గా ఏపీ ఏవియేషన్‌ అకాడమిలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత యూఎస్‌ఏతో పాటు వివిధ దేశాల్లో 14 ఏళ్ల నుంచి పైలట్‌ ఉద్యోగం చేశారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయన తాత్కాలికంగా ఉద్యోగానికి సెలవు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీపై చిన్నగోల్కొండ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుర్రం విక్రమ్‌రెడ్డిపై 673 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆనంద్‌రెడ్డి తండ్రి గుర్రం వెంకట్‌రెడ్డి మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ మండల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయన కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా విజయం సునాయాసంగా వరించిందని చెప్పవచ్చు. మనం సమాజం నుంచి తీసుకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆనంద్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని పేర్కొన్నారు. తన గెలుపుతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు