పత్తికి 'పురుగు' పీడ!

24 Oct, 2017 03:29 IST|Sakshi

రాష్ట్రంలో పంటను నాశనం చేస్తున్న గులాబీ రంగు పురుగు

దిగుబడులు సగానికి పడిపోయే ప్రమాదం

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

పురుగు నియంత్రణలో బీజీ–2 విఫలం!

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

25న అన్ని రాష్ట్రాల వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం

బీజీ–3 విత్తనాల అంశంపైనా మరో భేటీ

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలో పత్తి రైతుల ఆశలను గులాబీ రంగు పురుగు తొలిచేస్తోంది.. పంటను నాశనం చేస్తూ రైతులను నిండా ముంచుతోంది. ఇటీవలి వర్షాలతో ఓ వైపు పత్తి రంగు మారుతోంటే.. మరోవైపు గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడులు భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పత్తికి గులాబీ రంగు పురుగు పట్టడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వ్యవసాయశాఖ క్రాప్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా గులాబీ రంగు పురుగు తీవ్రతను గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చిందనే విమర్శలు మిగతా వ్యక్తమవుతున్నాయి. ఇక గులాబీ రంగు పురుగు ఉధృతితో ఇంత జరుగుతున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ కనీసం రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 విత్తనంతో జీవ వైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. 25వ తేదీనే బీజీ–3పై ఢిల్లీలో మరో సమావేశం జరుగనుంది.

10 లక్షల ఎకరాల్లో నష్టం?
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈ సారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు దానివైపే మొగ్గారు. కానీ పత్తి పంట రైతులకు తీవ్ర ఆవేదన మిగుల్చుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు 1.35 లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం జరగగా.. ఇప్పుడు దాదాపు మరో 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. దీంతో పంటంతా సర్వనాశనమవుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. విత్తనాల కోసం వేసిన పత్తి పంటకు కూడా ఈ పురుగు సోకిందని విత్తన సంస్థలు పేర్కొంటున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 25 నుంచి 30 శాతం వరకు పత్తికి గులాబీ పురుగు సోకినట్లు అంచనా. బీటీ టెక్నాలజీ విఫలమైనందునే బీజీ–2 పత్తి విత్తనం గులాబీ పురుగును తట్టుకునే శక్తి కోల్పోయిందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

వర్షాలు కురిసినా తగ్గని ఉధృతి
జూన్‌లో వేసిన పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకిందని నెల కిందటే రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్‌ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ రంగు ఉధృతమైంది. సాధారణంగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ ఇటీవల విస్తారంగా వర్షాలు పడినా.. పురుగులు నాశనం కాలేదు. మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండడంతో దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. గద్వాల జిల్లాకు చెందిన రైతులు తమ విత్తన పంటకు కూడా గులాబీ పురుగు సోకిందని వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు.  

పట్టించుకోని వ్యవసాయ శాఖ
గులాబీరంగు కాయతొలుచు పురుగు రాష్ట్రంలో పత్తి పంటను నాశనం చేస్తున్నా.. వ్యవసాయ శాఖ చేపట్టిన చర్యలు తూతూమంత్రంగానే ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల కిందటే ఈ పురుగు విస్తృతిని గుర్తించినా.. రైతుల్లో అవగాహన కల్పించడంలో విఫలమైందని, ఇంత నష్టం జరుగుతున్నా పరిస్థితిని దాచిపెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏడాది క్రితం గులాబీ రంగు పురుగుతో తీవ్ర నష్టం వాటిల్లడంతో.. కర్ణాటక ప్రభుత్వం మోన్‌శాంటో, మహికో కంపెనీలను రూ. 2 వేల కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేయడం గమనార్హం.

దేశవ్యాప్తంగా సమస్య
‘‘దేశవ్యాప్తంగా పత్తిని గులాబీ రంగు కాయతొలుచు పురుగు (పింక్‌ బోల్‌వార్మ్‌) పట్టింది. 25 శాతం నుంచి 30 శాతం పంటకు ఈ పురుగు సోకిందని అంచనా. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. గద్వాల జిల్లాలో పత్తి విత్తన పంటకూ గులాబీ రంగు పురుగు సోకింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది..’’
– డాక్టర్‌ కేశవులు, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు