పైప్‌లైన్‌ మరమ్మతు.. తాగునీటి సరఫరా

22 Apr, 2017 02:46 IST|Sakshi
పైప్‌లైన్‌ మరమ్మతు.. తాగునీటి సరఫరా

► ‘తాగునీటి తండ్లాట’ తీర్చిన అధికారులు

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం మాదాపూర్, అన్నాభావ్‌సాఠెనగర్, మాదాపూర్‌ గూడేల్లో 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌ పేజీలో ‘తాగునీటి తండ్లాట’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో 500 జనాభా ఉండగా.. మూడు చేతిపంపులు ఉన్నా పని చేయడం లేదని, పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తగూడ సమీపంలోని బావి నుంచి పైప్‌లైన్‌ ద్వారా ట్యాంక్‌కు నీటి సరఫరా చేసేవారు. పైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి సరఫరా కాక నిరుపయోగంగా మారింది. ఆయా గ్రామాల ప్రజల కష్టాలను ప్రచురించడంతో స్పందించిన అధికారులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించారు. పైపులైన్‌ పనులకు మరమ్మతులు చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ శ్రీనివాస్‌ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. మధ్యాహ్నం వరకు గ్రామంలో ఉన్న నీటిట్యాంక్‌కు నీటిని సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు