జీ హుజూర్‌..!

22 May, 2020 13:08 IST|Sakshi

‘మంచి’ పోస్టింగ్‌ల కోసం పోలీసుల పైరవీలు

ప్రజాప్రతినిధులు, పైరవీకారులతో కోరిన చోట కొలువులు

ఉత్తర్వులు రాకముందే కరీంనగర్‌లో ఖాళీ పోస్టుకు ఖరారైన పేరు

కొన్ని స్థానాలకు రుచిమరిగిన ఎస్‌ఐ, సీఐలు

ఎల్‌ఎండీలో రెండోసారి పోస్టింగ్‌కు ఓ ఎస్‌ఐ దస్తీ

ప్రజాప్రతినిధి ఆమోదంతోరేపో మాపో ఉత్తర్వులు

డీఎస్‌పీ ప్రమోషన్లతో ఖాళీ అయ్యే స్థానాలకు ముందస్తు కర్చీఫ్‌లు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పోలీసుశాఖలో కోరుకున్న చోట పోస్టింగ్‌ పొందడం చాలా సులువు. ఆర్థికంగా శక్తివంతులైన అధికారులుప్రజాప్రతినిధులు, వారి అనుచరులైన పైరవీకారుల అండతో కోరుకున్న పోస్టులను కొట్టేయడం సహజమే. ఎస్సై నుంచి ఏసీపీ స్థాయి వరకు పోలీస్‌ అధికారులు తమకు ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో ముందుగానే చెప్పుకునే పరిస్థితి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండ, పైరవీకారుల శక్తిని బట్టి పోలీసుశాఖలో పోస్టింగ్‌ వచ్చే తీరు ఆధారపడి ఉంటుంది. ఏ సీట్‌ ఎప్పుడు ఖాళీ అ వుతుందో.. అందులో ఎవరు కూర్చుంటారో... సదరు అధికారి పేరు పోలీస్‌ శాఖతోపాటు ప్ర జలకు సైతం ముందుగానే తెలిసిపోతోంది. జి ల్లాలోని కొన్ని పోస్టింగులయితే అంగట్లో సరుకుల్లాగా మారుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రతినిధి, ఒక వేళ ఆయన కాదంటే ఆయన అనుచర గణాన్ని ప్రసన్నం చే సుకొని లోలోన డీల్‌ కుదుర్చుకుంటే పోస్టింగ్‌ గ్యారంటీగా దక్కుతోంది. డిమాండ్‌ ఉన్న “మంచి’ పోస్టింగ్‌కి పిండి కొద్ది రొట్టె అన్నట్లుగా అదే స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని పోస్టింగ్‌లకు డిమాండ్‌ అధికంగా ఉండడంతో డీల్‌ విషయంలో కొందరు అధికారులు వెనుకడుగు వేస్తుంటే.. ఆర్థికంగా బలంగా ఉన్న వారు మాత్రం ముందుకొస్తున్నారు. “జీ హుజూర్‌’గా ఉంటా రని భావించే అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు లెటర్లు ఇచ్చేస్తుంటే.. కొన్ని నియోజ కవర్గాల్లో స్టేషన్‌ను బట్టి పోస్టింగ్‌కు రేట్‌ పలుకుతుందనేది బహిరంగ రహస్యం. ఈ రెండు మార్గాల్లో  పోస్టింగులు ఫైనల్‌ అవుతున్నాయి.

జిల్లాలో కొన్ని వర్గాలదే హల్‌చల్‌...
జిల్లా పోలీసుశాఖలో ఒకటి, రెండు సామాజిక వర్గాలు మాత్రమే హల్‌చల్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కోరిన చోట పోస్టింగ్‌లను దక్కించుకోవడంలో ఆయా సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ముందుండడంపై ప్రజల్లో చర్చ సాగుతోంది.  ఇందులో టు, త్రీ స్టార్‌ అధికారులు ఎక్కువగా ఉన్నారు. కాసులకు రుచిమరిగిన పోలీసు అధికారులు ఆదాయవనరులు అధికంగా ఉన్న చోట పోస్టింగ్‌లను దక్కించుకునేందుకు ఎంతకైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అప్‌గ్రేడ్‌ కాని పోలీస్‌  స్టేషన్లలో డిమాండ్‌ ఉన్న స్టేషన్లకు ఎస్‌ఐలు పైరవీలు చేసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ కీలకమైన పోస్టు ఖాళీకాగా... అన్ని హంగులు ఉన్న ఓ అధికారి పట్టుపట్టి పోస్టింగ్‌ తెచ్చుకున్నాడు. ఇక్కడ సామాజికవర్గంతో పనిలేకుండా గతంలో నగరంలో పనిచేసిన సంబంధాలు ఉపయోగపడ్డట్టు తెలుస్తోంది. సదరు అధికారి ఆ పోస్టులోకి వస్తున్నట్లు పది రోజుల క్రితమే ఉమ్మడి జిల్లా పోలీస్‌ సర్కిళ్లలో తెలిసిపోయింది. 

ఎల్‌ఎండీ స్టేషన్‌కు భలేగిరాకీ...
జిల్లాలోని అప్‌గ్రేడ్‌ కాకుండా డిమాండ్‌ ఉన్న పోస్టుల్లో ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ ఒకటి. తిమ్మాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని ఇక్కడ పోస్టింగ్‌ కోసం గతంలో పనిచేసిన ఎస్‌ఐ రెండోసారి అరుదెంచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. గతంలో ఇక్కడ పనిచేసి పలు ఆరోపణల నేపథ్యంలో.. జిల్లాలోనే మరోచోట కోరుకున్న పోస్టింగ్‌ని దక్కించుకున్నాడు. మానకొండూర్‌ నియోజకవర్గం పరిధిలోని పక్క జిల్లా మండలంలో పోస్టింగ్‌కి వెళ్లిన సదరు ఎస్‌ఐ మళ్లీ ఎల్‌ఎండీ కోసం పెద్ద ఎత్తున పైరవీ చేస్తున్నాడు. ఎల్‌ఎండీపై ప్రేమతో మరోసారి కర్చీఫ్‌ వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచురులైన సొంత సామాజికవర్గంతో వారితో డీల్‌ కుదుర్చుకొని లెటర్‌ని ఉన్నతాధికారులకు పంపించుకున్నట్లు తెలిసింది. çఅదే సమయంలో పక్క జిల్లాలోని ఓ మండలానికి ఇక్కడి అధికారి వెళ్లడానికి కూడా డీల్‌ కుదురినట్లు సమాచారం. ఎల్‌ఎండీలో పనిచేసిన సమయంలో విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు, బంధువులతో రియల్‌ దందా చేయించినట్లు కూడా ఆరోపణలున్నాయి. అదే స్టేషన్‌కు రెండోసారి ఎస్సైగా వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను బట్టి ఇక్కడున్న వనరులెంతో తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎస్‌ఐ ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న కొన్ని పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పలువురు ఆసక్తి చూపుతున్నారు.

డీఎస్‌పీలుగా వెళ్లే ఆరుగురి స్థానంలో ఇప్పటికే పైరవీలు
1995 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలకు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందనే విషయం తెలిసిందే కదా. తాజాగా అందిన సమాచారం ప్రకారం జూన్‌ నెలలో ఈ బ్యాచ్‌లోని సీఐలకు వారి మె రిట్, డీమెరిట్‌ల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరు సీఐ పోస్టులు ఖాళీ అవుతాయి. టూటౌన్‌లో వి« దులు నిర్వర్తించిన దేవారెడ్డి ఇటీవలే తప్పని సరి పరిస్థితుల్లో డీఐజీకి అటాచ్‌ కాగా ఆయన స్థానంలో లక్ష్మీబాబుకు బుధవారమే పోస్టింగ్‌ ఇ చ్చారు. లక్ష్మీబాబు స్థానంలో ధర్మపురికి సీ సీఎస్‌ సీఐగా ఆరునెలల క్రితం విధుల్లో చేరిన రాంచందర్‌రావు అవకాశం తెచ్చుకున్నారు. రూరల్‌ సీఐ, తిమ్మాపూర్‌ పీఎస్‌ల ఇన్‌స్పెక్టర్లు పదోన్నతిపై వెళితే ఈ రెండు పోస్టులకు ఎక్కడలేని డిమాండ్‌. కాగా వారు వెళితే ఎవరు వ స్తారు అనే విషయంలో ఇప్పటికే పోలీస్‌ సర్కిళ్లలో పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, రామగుండం పోస్టులకు కూడా డిమాండ్‌ అ ధికంగా ఉంది. ఒకరిద్దరు అధికారులు ఇప్పటికే కర్చీఫ్‌లు పరిచినట్లు ప్రచారం జరుగుతోంది. రామగుండం సీసీఎస్‌కు మాత్రం పెద్దగా డి మాండ్‌ లేదు. అలాగే మూడేళ్లుగా ఒకేదగ్గర ప నిచేస్తున్న సీఐ పోస్టులకు కూడా డిమాండ్‌ ఉంది. జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, సుల్తానాబాద్‌ వంటి స్టేషన్లకు కూడా ఇప్పటి నుంచే పైరవీలు సాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా