ఎక్కడికక్కడ కట్టడి!

10 Jun, 2018 00:54 IST|Sakshi

కృష్ణా పునరుజ్జీవం దిశగా ప్రభుత్వ అడుగులు

గరిష్ట నీటి వినియోగం కోసం చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల నిర్మాణం

హాలియా, తుంగపాడు బంధం అందులో భాగమే

ఇప్పటికే రూ.120 కోట్లతో పాలేరు, మూసీపై 19 చెక్‌డ్యామ్‌లు..

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేసిన్‌లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది.

తద్వారా కృష్ణానది పునరుజ్జీవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాలేరు, మూసీపై 19 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మిగతా ఉప నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది.  

మహారాష్ట్ర మాదిరే..
కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 299 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నాయి. అయితే ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలు లేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు.

ఇక ముఖ్యంగా కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఎడాపెడా ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని వాడేస్తోంది. దీంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసినా కేవలం 568 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఇందులోనూ ఏపీ తన వాటా కింద 379 టీఎంసీల నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 189 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంది.

ఇక రాష్ట్ర వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో 89 టీఎంసీల మేర చిన్ననీటి వనరుల కింద కేటాయింపులున్నాయి. ఇవన్నీ కృష్ణాసబ్‌ బేసిన్‌లోని చిన్న చిన్న ఉపనదులు, వాగుల నుంచి లభ్యమవుతున్న నీరే. అయితే ఈ నీటిని ఒడిసి పట్టుకోకపోవడంతో కేవలం 35 నుంచి 40 టీఎంసీల వినియోగం మాత్రమే ఉంటోంది.  

ఎక్కడికక్కడే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలోని ఆకేరు వాగుపై 8 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేసింది. కొత్తగా ఇటీవలే సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మూసీనది, పాలేరు వాగుపై 19 చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సుమారు రూ.120.51 కోట్లతో పాలనా అనుమతులనిచ్చింది.

కోదాడ పరిధిలోనూ పాలేరుపై మరో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, ఖమ్మం జిల్లా నుంచి సైతం ఇదే పాలేరుపై మరో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇక దీంతో పాటే మహబూబ్‌నగర్‌లోని ఆర్డీఎస్‌ పరిధిలోని పెద్దవాగుపై మునుపోడ్‌ మండలంలో మరో చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి డిమాండ్‌ వస్తోంది. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది.  

సాగర్‌ కింద రెండు ఎత్తిపోతలు..
ఇక గరిష్ట ఆయకట్టుకు కృష్ణా నీటి మళ్లింపు లక్ష్యంగా నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు.

ఇదే టెయిల్‌పాండ్‌ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. వీటికీ ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులతో చేపట్టనున్నారు. వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  

మరిన్ని వార్తలు