ఓటర్ల జాబితాలు సిద్ధం చేయండి

15 Feb, 2019 06:07 IST|Sakshi

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: మండల, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే జూలై 3,4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీపీల కాలపరిమితి ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు ముగియగానే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ వెలువరించనుంది.

ఈ నెల 22న ప్రకటించనున్న (2019 జనవరి 1 నాటి) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) సిద్ధం చేయాలని ఎస్‌ఈసీ సూచించింది. ఈ విషయంలో వెంటనే  చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి  చర్యలు వేగవంతం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కి ఎస్‌ఈసీ సూచించింది. ఈ జాబితాలకు అనుగుణంగా మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా ప్రజా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా సీఈవోలు తయారు చేయాల్సి ఉంటుంది.

గురువారం ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్‌ మినహా), జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ లు పంపించారు. గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా  ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రచురించడానికి  ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక అధికారిని నియమించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు పంచాయతీ కార్యదర్శి కేడర్‌ అధికారిని డిజిగ్నేట్‌ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి అనుసరించాల్సిన  మార్గదర్శకాలు పాటిం చాలని సూచించింది.   పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలను సరిచూసుకునే కార్యక్రమాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది.

మరిన్ని వార్తలు