పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలి

27 Jul, 2014 01:11 IST|Sakshi
పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలి

 రాంనగర్ :మన జిల్లా- మన ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల భాగస్వామ్యంతో పకడ్బందీగా ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ టి. చిరంజీవులు కోరారు. శనివారం తన బంగ్లాలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు గల అవకాశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేయడానికి నిధుల లభ్యత, వ్యయం, నిధులు సమకూర్చుకోవడం తదితర అంశాలను ప్రణాళికలో పొందుపర్చాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని భవనాలు అవసరం ఉన్నాయో, వాటికి ఎన్నినిధులు అవసరమో వచ్చే 5సంవత్సరాలలో ఏవిధంగా పూర్తి చేయాలో ప్రణాళికలో పొందుపర్చాలన్నారు. జిల్లాలో నిర్లక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు.
 
 అలాగే చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు స్కిల్స్ డెవలప్‌మెంట్స్‌పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ విభాగాలు అన్నీ కలిసి సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో పండ్ల తోటలు, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన ప్రణాళికలు తీర్చిదిద్దాలని తెలిపారు. చేపల పెంపకం, సెరీకల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖ ద్వారా గోదాములు నిర్మించడానికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కోరారు.
 
 వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మండలస్థాయిలో తయారు చేసిన ప్రణాళికలో రాని అంశాలను జిల్లా స్థాయిలో పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తగిన ప్రణాళికను తయారుచేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, నియోజకవర్గానికి ఒక ఓల్డేజ్ హోం, మానసిక వికలాంగులకు పునరావాస కేంద్రం, శిశు కేంద్రాలు, వర్కింగ్‌ఉమెన్ హాస్టల్స్ భవనాల నిర్మాణా కోసం ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు