పక్కా ప్రణాళికతోనే ఫలితాలు

3 Oct, 2017 01:29 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం

హన్మకొండ: పక్కా ప్రణాళికతో, పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను రూపొందించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం అన్నారు. హన్మకొండలో సోమవారం ‘గోదావరి జలాలు సమగ్ర వినియోగం–సమస్యలు–పరిష్కారం’ అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

సదస్సులో వెదిరె శ్రీరాం ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ పూర్తిస్థాయి నివేదిక లేకుండా ప్రాజెక్టులను నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూపిస్తూ రూ.లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. అయిదు తరాల ప్రజలు తీర్చినా తీరలేనంత అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్పులు చేసేందుకు ఉత్సాహం చూపుతుందని మండిపడ్డారు. నదులు లేనిచోట ప్రాజెక్టులు నిర్మించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు.

దేవాదుల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక తయారు చేయకుండానే పనులు చేపట్టారన్నారు. రిజర్వాయర్‌ లేకుండా ప్రవహిస్తున్న నీటితో అనుకున్న మేరకు నీటిని ఎలా తోడుకోగలమని ప్రశ్నించారు. రిజర్వాయర్‌ నిర్మిస్తే నీరు నిల్వ ఉండి కావాల్సిన మేరకు సులువుగా నీటిని తోడుకోగలమన్నారు. ఇప్పటికై నా దేవాదుల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులకు కావాల్సిన నీటి లభ్యతకు రిజర్వాయర్లు నిర్మి ంచాల్సిన అవసరముందన్నారు. నదులపై ఒక దాని కింద ఒకటి ఆనకట్ట నిర్మించడం ద్వారా అధిక నీటిని నిల్వ చేసుకోవచ్చని, తద్వారా నౌకాయానం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ సాగునీటి జలాల వినియోగంపై విస్తృత చర్చ జరగాలని తెలిపారు.

మరిన్ని వార్తలు