‘మొక్క’వోని దీక్షతో..

4 Jul, 2015 01:37 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని జిల్లాల్లో పర్యటించి స్వయంగా మొక్కలు నాటేందుకు సిద్ధమైన నేపథ్యంలో శనివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లోని హుస్నాబాద్, మానకొండూరు, పెద్దపల్లి, ధర్మపురి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వయంగా మొ క్కలు నాటాలని నిర్ణయించారు. సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్ సహా అధికార యంత్రాంగమంతా శుక్రవారం ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటించే బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, ముల్కనూర్, ఎల్‌ఎండీ ప్రాంతాల్లోని మొక్కలు నాటే ప్రదేశాలను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముల్కనూరులో సీఎం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ తదితరులు సీఎం రాక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 
 శనివారం కేసీఆర్ పర్యటన ఇలా...
 కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోకి ప్రత్యేక బస్సు ద్వారా ప్రవేశిస్తారు. తొలుత కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోడల్‌స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడినుంచి 3.40 గంటలకు బస్వాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, 4.15 గంటలకు హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మొక్కలు నాటడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు చిగురుమామిడి మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
 
 5.15 గంటలకు ముల్కనూర్, 5.40 గంటలకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, 5.55 గంటలకు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, 6.20 గంటలకు అల్గునూర్‌లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో మొక్కలు నాటుతారు. అనంతరం కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లికి చేరుకుని ఉత్తర తెలంగాణ భవన్‌లో రాత్రి బస చేస్తారు.
 
 ఆదివారం పర్యటన షెడ్యూల్
 ఆదివారం ఉదయం 8 గంటలకు ఆయన ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 8.15 గంటలకు సర్కస్‌గ్రౌండ్‌లో, 8.35 గంటలకు శాతవాహన విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటుతారు. అనంతరం 9.15 గంటలకు కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుని హెలిక్యాప్టర్ ద్వారా యాదాద్రికి బయలుదేరుతారు. రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ యూదాద్రి దర్శనానికి వస్తున్నందున కేసీఆర్  ఆ కార్యక్రమానికి హాజరవుతారు.
 
 అనంతరం తిరిగి హెలిక్యాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దపల్లి ఐటీఐ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుని కళాశాలల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2.40 గంటలకు ధర్మారం మార్కెట్‌యార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తన బస్సులో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బయలుదేరుతారు.

మరిన్ని వార్తలు