చెరువుల పరిసరాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలి

27 Feb, 2019 02:07 IST|Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌:  చెరువుల పరిసరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగులు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను చెరువుల పరిసరాల్లో నిర్దిష్ట దూరం వరకు నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నింటిపై ఏం చేస్తే బాగుంటుందో తగిన సూచనలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల బారి నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారి అంజనా సిన్హా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్య్సకారుడు సుధాకర్‌ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వీటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ (అస్కీ) ద్వారా జియోట్యూబ్‌ టెక్నాలజీ ద్వారా శుభ్రం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై రెండు వారాల్లో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామన్నారు. తరువాత మల్కం చెరువు పరిరక్షణ గురించి చర్చకు వచ్చింది. చట్ట ప్రకారం చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. మల్కం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవసరమైతే పోలీసు బలగాల సాయం కూడా తీసుకోవచ్చని జీహెచ్‌ఎంసీకి తేల్చి చెప్పింది. చెరువుల్లో ప్లాస్టిక్‌ చెత్త పేరుకుపోతుండటం వల్ల ఎదురవుతున్న దుష్ప్రభావాలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

మరిన్ని వార్తలు