రేవంత్ బెయిల్ రద్దు చేయండి

3 Jul, 2015 01:31 IST|Sakshi

⇒ మరో ఇద్దరు
⇒ నిందితులకు కూడా...
⇒ సుప్రీంకోర్టులో 2 ఎస్‌ఎల్‌పీలు దాఖలు చేసిన రాష్ట్ర ఏసీబీ
⇒ నేటి మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం

 
 సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీ)దాఖలు చేసింది. ఏసీబీ తరపున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ప్రస్తావన (మెన్షనింగ్)కు అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మెన్షనింగ్ జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో పిటిషన్ ఉంటే ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ అదే సమయంలో విచారణ మొదలుపెట్టవచ్చు లేదా మరో తేదీకి వాయిదా వేయవచ్చు లేదా పిటిషన్‌ను తిరస్కరించనూవచ్చు.
 బెయిల్ వల్ల దర్యాప్తునకు ఆటంకం
 బెయిల్‌పై విడుదలైన అనంతరం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఇది హైకోర్టు షరతులను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నట్లు రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. బెయిల్‌ను రద్దు చేయడం వల్ల మాత్రమే ఏసీబీకి తదుపరి దర్యాప్తునకు వీలవుతుందని విన్నవించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలను లంచంగా ఇవ్వజూపుతూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డికి బెయిల్ కొనసాగితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందన్నారు.
 
 

మరిన్ని వార్తలు