పింఛన్ ఇప్పించండి సారూ..

11 Nov, 2014 02:56 IST|Sakshi

జిల్లా నలుమూలాల నుంచి ప్రతీ సోమవారం ఫిర్యాదుల విభాగానికి వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు స్పందించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.

తమకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని వికలాంగులు, వితంతులు, వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు వ్యవసాయ భూమిని ఇప్పించాలని, ఇంటి స్థలం ఇప్పించేలా చూడాలని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.- ఆదిలాబాద్ రూరల్

టవర్ నిర్మాణం రద్దుచేయాలి
ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిర్మాణ పనులను వెంటనే రద్దు చేయాలని విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గంగారెడ్డి, మామిడి లక్ష్మణ్, సభ్యులు మామిడి భాస్కర్, చిలుక స్వామి, మునేశ్వర్, రవి, జి.శ్రీనివాస్, సాయ్యన్న ఫిర్యాదు చేశారు.

తమ కాలనీలో గృహ సముదాయంలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిబంధనాలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో రేడియేషన్ ప్రభావంతో గర్భిణులకు, మానసిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించి సెల్‌టవర్ నిర్మాణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

  పింఛన్ కట్ అయింది
 కొన్నేళ్ల నుంచి మొన్నటి వరకు నాకు పింఛన్ వచ్చింది. ప్రస్తుతం పింఛన్ రావడం లేదు. వితంతువులం, వృద్ధులం. మాకు ఎవరు అన్నం పెడుతారు. కనీసం పింఛన్‌తోనైనా బతుకుదామని ఆశతో ఉంటే వస్తున్న పింఛన్ కూడా కట్ అయింది. వెంటనే మాకు పింఛన్ వచ్చేలా చూడాలి.
 -  సుశీల, అడేల్లా, దేవమ్మ, వితంతువులు, జందాపూర్, ఆదిలాబాద్

 ఏఏఈవో ఉద్యోగాలు ఇవ్వాలి
 ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న 440 పోస్టుల్లో ఏఏఈవో ఉద్యోగాల్లో మాకు సైతం అవకాశం కల్పించాలి. మరికొన్ని రోజులైతే మా కోర్సు పూర్తవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో తమకు అవకాశం కల్పించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో సుమారు 5 వేల మంది ఈ కోర్సు పూర్తి చేసిన వారము ఉన్నాం. మాకు అవకాశం కల్పించకుండా కేవలం అగ్రికల్చర్ డిప్లొమా, పాలిటెక్నిక్ చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారితో పాటు తమకు కూడా అవకాశం కలిగేలా చూడాలి. కాగా, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో అగ్రికల్చర్ విద్యార్థులు సుధాకర్, స్వాగత్, సునీల్, నర్మద, శైలజ, పద్మ, శ్రీలత ఉన్నారు.            - అగ్రికల్చర్ అసిస్టెంట్ విద్యార్థులు

 పోలీసులు జర పట్టించుకోవాలి
 ఆగస్టులో మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే నా భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఎవరో దొంగ నా భార్య మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగలించుకుపోయాడు. అప్పుడు సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశాను. దొంగతనం జరిగినప్పటి దృశ్యం రిమ్స్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి. దొంగను పట్టుకుని మా బంగారం మాకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. - నాయిని సుదర్శన్, ఖుర్షీద్‌నగర్, ఆదిలాబాద్

మరిన్ని వార్తలు