తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది

4 Jun, 2018 07:52 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిందు

సూర్యాపేట : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంట్లోని తమ కూతురు ఏడాది నుంచి పొట్టలోపలి భాగంలోని ఫ్రాంక్టాటిస్‌లో గడ్డ కావడంతో బాధపడుతూ.. రోజురోజుకూ క్షీణిస్తున్న బిడ్డ ఆరోగ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రి తల్లడిల్లిపోతున్నారు. తమ గారాలపట్టికి ఎలాగైనా వైద్యమందించి బతికించుకునేందుకు సూర్యాపేట పట్టణానికి చెందిన నిమ్మ బింధు తల్లిదండ్రులు నిమ్మ శ్రీనివాస్‌–రాజేశ్వరి సాయం కోసం వేడుకుంటున్నారు.


పట్టణానికి చెందిన శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్‌ పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలో చదవిస్తున్నాడు. వారిలో చిన్న కుమార్తె బిందు ఇమాంపేట గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బిందు ఏడాది కాలంగా కడుపులోనొప్పితో బాధపడుతోంది. దీంతో పలు ప్రైవేట్‌ ఆస్పత్రులో వైద్యం చేయించాడు. ఇటీవల తీవ్రమైన కడుపులో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని నక్షత్ర హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా.. కడుపులోని ఫ్రాంక్టాటిస్‌లో పెద్దగడ్డ ఉందని.. దానిని ఆపరేషన్‌ చేసి తీయాలని.. దీని కోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి జబ్బు వెయ్యిలో ఒకరికి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. 
చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు
20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో గల నక్షత్ర కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు చిన్నారి బిందును చేర్పించారు. వారి చేతిలో ఉన్న రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆపరేషన్‌ కోసం మరో రూ.5 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సాయం కోసం ఎదురుచూపు 
పేద తల్లిదండ్రులు తమ బిడ్డ బింధు ఆపరేషన్‌ ఖర్చుల నిమిత్తం ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. దయఉంచి సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 99123 69343, 90107 50593, 99487 64487 సెల్‌ నంబర్లను సంప్రదించవచ్చు. అకౌంట్‌ నంబర్‌ ఎస్‌బీహెచ్‌ సూర్యాపేట 62259021457.ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి
తన కుమార్తె బింధు వైద్యానికి మనసున్న దాతలు సాయం చేసి ఆదుకోవాలి. ఇప్పటికే వైద్యం కోసం సంవత్సర కాలంలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేశాం. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నాం. వైద్యం కోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. నా బిడ్డ ఆపరేషన్‌ కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నా.

మరిన్ని వార్తలు