ప్లాన్‌ ఓకే అయితేనే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌

3 May, 2019 01:53 IST|Sakshi

సబ్‌ రిజిస్ట్రార్లకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లలో స్థలాల క్రయ విక్రయాలకు ముకుతాడు వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకుండా రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేస్తోంది. మొదట హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ఈ పద్ధతిని అమలు చేసి తర్వాత.. డీటీసీపీ ఆధీనంలోని గ్రామీణ ప్రాంతాల్లోని లేఅవుట్లకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ అనుమతి పొందని లేఅవుట్లలో ప్లాట్లపై నిషేధం విధిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు అధికారిక లేఅవుట్లలో మాత్రమే రిజిస్ట్రేషన్లను అనుమతించాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆయన లేఖ రాశారు. 7 జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, లేఅవుట్‌లను గుర్తించేందుకు గత నెల 29 నుంచి ఈ నెల 10 వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు చౌకగా లభించే అనధికార లే అవుట్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు.

కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుద్దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. లేఅవుట్‌ అభివృద్ధితో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధం లేకపోవడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను యథేచ్ఛగా చేస్తోంది. దీంతో ఇకపై ఇలాంటి వ్యవహారానికి ఫుల్‌సాప్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ నుంచి తుది అనుమతి (ప్లాన్‌ అప్రూవ్డ్‌) అయిన వెంచర్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖను కోరింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా