పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

17 Jul, 2019 01:27 IST|Sakshi

అర్హుల వివరాలను కేంద్రం 

పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన రాష్ట్రం

నెలాఖరులో రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్న కేంద్రం

మొదటి విడతలో రూ.690 కోట్లు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌) పథకం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందున్న మార్గదర్శకాల్లో మార్పు చేయడంతో అనేకమంది అర్హులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 34.51 లక్షల మంది రైతులను ఈ పథకంలో లబ్ధిదారులుగా వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. ఆయా లబ్ధిదారుల వివరాలను పీఎం–కిసాన్‌ పోర్టల్‌లో మంగళవారం నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. తొలి విడతలో వీరికి పంపిణీ చేయాల్సిన సొమ్మును ఈ నెలాఖరులో బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–కిసాన్‌’పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, దానిని 3 విడతలుగా (విడతకు రూ.2 వేలు) పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో 54.50 లక్షల మంది రైతులున్నారు. పీఎం–కిసాన్‌ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులనే అర్హులుగా గుర్తించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. వారిలో మొదటి విడతలో 18.47 లక్షల మంది రైతులకు రూ.369.40 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి విడత పంపిణీ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్న కారణంతో మే 23 తేదీ వరకు మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయలేదు. ఆ తర్వాత రెండో విడతలో 18.58 లక్షల మంది రైతులకు రూ.370.16 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులను పీఎం–కిసాన్‌ లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ 18 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన లబ్ధిదారులను వివిధ రకాల సాంకేతిక కారణాలు చూపించి విస్మరించారు. 

పెరిగిన లబ్ధిదారులు.. 
ఈసారి పీఎం–కిసాన్‌ పథకంలో కొన్ని నియయ నిబంధనలను సడలించారు. కేవలం ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు కాకుండా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది . దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఈ లబ్ధిదారుల సంఖ్య 27.42 లక్షలు ఉండగా.. ఇప్పుడు 34.51 లక్షలకు పెరిగింది. కొత్తగా 7.09 లక్షల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చారు.

ఈ నెలాఖరులోగా మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. రెండో విడత సొమ్మును అక్టోబర్‌లో, మూడో విడత సొమ్మును తర్వాత మేలో పంపిణీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి లబ్ధిదారులుగా ఎంపికైన రైతులకు నగదు బదిలీ చేయటానికి ఒక్క విడతకు రూ.690.20 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు విడతల్లో కలిపి రూ.2,070.60 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రంలోని రైతాంగానికి అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.  

మరిన్ని వార్తలు