‘కిసాన్‌’ లెక్క తేలింది 

21 Feb, 2019 08:41 IST|Sakshi

కరీంనగర్‌: ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌)’కి అర్హులైన రైతుల లెక్క తేలింది. ఐదు ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్‌బుక్‌ ఉన్న రైతులకే కేంద్రసాయం అందనుంది. ఈ లెక్కన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 60,268 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సదరు రైతు ఖాతాల్లో ఈనెల 24వ తేదీ నుంచి తొలి విడత రూ. 2వేల సాయం జమ కానుంది. ఈ మేరకు వ్య వసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.  జిల్లాలో 1.40 లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వీరిలో 72,924 మంది పీఎం కిసాన్‌ పథకానికి అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక రూపొందించారు.

మొదటి విడత సర్వేలో ఒకే కుటుంబంలో ఒక్క రైతుకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల 60,268 మంది రైతులు అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామాల్లో ఆదాయ పన్ను కట్టేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థల పేరుతో భూములు కలిగి ఉన్నవారు, పది వేలకు మించి పింఛన్‌ పొందుతున్నవారు, ఒకే కుటుంబానికి ఐదు ఎకరాలకు మించి భూములు ఉన్నవారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, కార్పొరేషన్‌ మేయర్లు, ఉద్యోగ విరమణ పొందినవారు, వృత్తినిపుణలైన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెట్‌ అకౌంటెంట్లను మినహాయించి సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండవ విడత సర్వేలో మిగిలిన రైతు కుటుంబాల నుంచి వివరాలు సేకరించి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి అర్హులను ప్రభుత్వానికి నివేదించనున్నారు.

కొందరికే లబ్ధి.. రైతుల అసంతృప్తి 
చిగురుమామిడి: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కృషి సమ్మాన్‌ నిధి’ పథకంపై రైతులు సంతృప్తికరంగా లేరు. ఈ పథకం కింద ప్రభుత్వం విధించిన నిబంధనలపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిగురుమామిడి మండలంలోని దాదాపు 70శాతం మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. ఎందుకనగా ఒకే రేషన్‌కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న రైతు కుటుంబీకులకు ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ పొందని వారికి కూడా వర్తించడంలేదు. ఐదు ఎకరాలు, ఆపైన భూమి కలిగి ఉన్నా ఈ స్కీమ్‌కు రైతు అర్హుడుకాడు. ఇచ్చే రూ.6వేలకు పలు నిబంధనలు విధించడం వల్ల రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు ఎకరాల భూమి కంటే లోపు ఉన్న రైతులే అర్హులని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన చిగురుమామిడి మండలంలో మొదటి విడతగా 4194 మంది రైతులు మాత్రమే అర్హత పొందారు. ఈ మండలంలో దాదాపు 11వేల మంది రైతులకు గాను 4194 మందికే రూ.6వేల పెట్టుబడి సాయం అందనుదని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అర్హుల జాబితాలను ప్రచురించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వేసిన జాబితాలను చూసిన రైతులు తమ పేర్లు రాలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని అధికారుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రధానమంత్రి కృషి సమ్మాన్‌ నిధి కింద పెట్టుబడి సాయం అందనుందని మండల వ్యవసాయాధికారి కె.రంజిత్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు