హైదరాబాద్‌కు మోదీ, ఇవాంకా ట్రంప్‌

11 Aug, 2017 02:19 IST|Sakshi
హైదరాబాద్‌కు మోదీ, ఇవాంకా ట్రంప్‌

నవంబర్‌లో 3 రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
సాక్షి, హైదరాబాద్‌ : భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల (పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.  ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడం ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ ఈ చారిత్రక సదస్సుకు వేదిక అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, భారతదేశం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ అమితాసక్తి చూపడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని ట్వీటర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినందుకు ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు