రైళ్లను ఇప్పుడే పునరుద్దించవద్దు: ప్రధానితో సీఎం కేసీఆర్‌

11 May, 2020 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అప్పుడే ప్యాసింజర్‌ రైళ్లను నడపవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ నెల 17తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రధానంగా మూడు అంశాలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో వెంటనే రైళ్లను పునరుద్దరించవద్దని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైళ్లను నడిపితే రాకపోకలు ఎక్కువ అవుతాయని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని అన్నారు. అంతేకాకుండా వీరందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని, అలాగే వారిని క్వారంటైన్‌కు తరలించడం కూడా కష్టం అవుతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వ‍్యక్తం చేశారు. (అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్‌)

 ఇక జులై, ఆగస్ట్‌ మాసంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఈ వ్యాక్సిన్‌ హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అప్పులను రీ షెడ్యూల్‌ చేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని కూడా పెంచాలని కేసీఆర్‌ కోరారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని, రాష్ట్రాలకు ఆదాయాలు లేనందున అప్పులు కట్టే పరిస్థితి లేదన్నారు. అన్ని రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్‌ చేసేలా కేంద్రం చొరవ చూపాలన్నారు. ఇక కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఎలాంటి అలక్ష్యం వద్దని అన్నారు. జోన్ల విషయంలో పాజిటివ్‌, యాక్టివ్‌ కేసులు లేని జిల్లాలను ...రాష్ట్రాలు కోరిన వెంటనే మార్పులు చేయాలని అన్నారు. కరోనా ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదని, కలిసి జీవించాల్సిందేనని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. (సడలింపులపై దృష్టి పెట్టండి: మోదీ)

కరోనాతో కలిసి సాగాల్సిందే...
కాగా అంతకు ముందు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదన్న ఆయన.. కరోనా ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగించాలో ప్రణాళిక అవసరమన్నారు. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కార్యకలాపాల కొనసాగింపుపై ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు)

మరిన్ని వార్తలు