‘విద్యుత్’పై మీ చొరవ భేష్

16 Feb, 2015 00:48 IST|Sakshi

- రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని ప్రశంసల జల్లు


సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలను, నూతన ఆవిష్కరణలను, ఆలోచన విధానాన్ని ఆయన స్వాగతించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నూతన, పునర్వినియోగ ఇంధన రంగ పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 
 
13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలులో భాగంగా విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడంలో రాష్ట్రంలోని పది జిల్లాలు మంచి ఫలితాలు సాధించాయని ప్రధాని మెచ్చుకున్నారు. దేశంలో మెరుగైన ఫలితాలు సాధించిన 12 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం అభినందనీయమన్నారు. గత కొద్ది నెలలుగా సౌర విద్యుత్‌తోపాటు నూతన, పునర్వినియోగ ఇంధన వనరులను అమలులోకి తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అవార్డు అందించారు. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, ప్రధాని ప్రశంసలపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రశంస తమకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

 

మరిన్ని వార్తలు