భూ ఆక్రమణలపై సభా సంఘాలు

20 Jan, 2015 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల కబ్జాలతో పాటు సహకార సొసైటీల్లో అక్రమాలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం 3 శాసనసభా సంఘాలను వేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్న మేరకు 3 నెలల కాలపరిమితితో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి ఒక్కో కమిటీని 13 మందితో ఏర్పాటు చేసింది.
 
 దేవాదాయ, భూదాన్, సీలింగ్ మిగులు, ఇనాం భూముల వివరాలను సేకరించడంతో పాటు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ అమ్మకాలపై వేసిన కమిటీ సమాచారం సేకరిస్తుంది. మేడ్చ ల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. ఇక ప్రభుత్వ భూములు పొందిన జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీలకు ఇచ్చిన భూముల వివరాలు, ఏవైనా అక్రమాలు జరిగాయా అన్న అంశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ‘హౌసింగ్ సొసైటీల’పై వేసిన కమిటీ పరిశీలిస్తుంది.
 
 వక్ఫ్ భూ ములు, వాటిల్లో అన్యాక్రాంతమైన, కబ్జాలో ఉన్నవాటి వివరాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన వక్ఫ్ భూముల కమిటీ పరిశీలిస్తుంది. కాగా ఈ కమిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలకు ప్రాతినిధ్యం లభించ లేదు.
 

మరిన్ని వార్తలు