వేధిస్తున్న సిబ్బంది కొరత

5 Apr, 2019 08:56 IST|Sakshi

పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కొంతకాలంగా ఇదే దుస్థితి

పట్టించుకోని అధికారులు

సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో  సిబ్బంది కొరత వేధిస్తుంది. ఏడాది కాలంగా సరిపడా సిబ్బంది లేక ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో చోటు చేసుకునే సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు,  నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్‌ కలిపి మొత్తం 28 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 13 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా అరకొర సిబ్బందితో ఉన్న వారిపై పనిభారం పెరిగుతుందని పలువురు వాపోతున్నారు.

స్టేషన్‌ పరిస్థితి ఇలా..
పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 22 గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది.  కాగా స్టేషన్‌లో 21 మంది కానిస్టేబుళ్లకు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. 8 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 13 మందిలో  ఇద్దరు కానిస్టేబుళ్లను ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద భువనగిరి హెడ్‌క్వాటర్స్‌కు అటాచ్‌ చేశారు.  ఒకరు సీఐ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తుండగా, మరొకరు రోడ్డు ప్రమాదంలో గాయపడి సెలవుల్లో ఉన్నారు. వీరు పోను మిగిలిన 9 మందిలో ఒకరు రైటర్‌ కాగ, మరొకరు ప్రతిరోజు కోర్టు డ్యూటీకి వెళ్తారు. మరో ఇద్దరికి రెగ్యులర్‌గా స్టేషన్‌ వాచ్‌ డ్యూటీ ఉంటుంది.

మిగిలిన ఐదుగురు సిబ్బంది మండలంలో శాంతిభద్రతల విధులతో పాటు, ఇటు ప్రముఖుల బందోబస్తు, హైవేపై చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహించాల్సి వస్తుంది. స్టేషన్‌లో ఉన్న ఇద్దరు హోంగార్డులు జీపు డ్రైవర్లుగా ఉన్నారు. స్టేషన్‌లో కనీస సిబ్బంది లేకపోవడంతో సమస్యల పరిష్కారం సైతం మందకోడిగా జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.  

కనిపించని గ్రామ పోలీస్‌..
గతంలో ప్రతి గ్రామానికి ఓ పోలీస్‌ అధికారిని అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దీంతో పల్లెల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా గ్రామాధికారులు పరిష్కరించే వారు. సిబ్బంది కొరతతో గ్రామ పోలీస్‌ అధికారులు లేకుండా పోయారు. ప్రతి చిన్న సమస్యకు ప్రజలు మండల కేంద్రంలోని స్టేషన్‌కు తప్పడం లేదు.  

మరిన్ని వార్తలు