ప్రపంచానికే ఆదర్శం ‘రైతుబంధు’

18 Nov, 2018 02:29 IST|Sakshi

ఐరాస గుర్తింపుపై మంత్రి పోచారం హర్షం

20 నుంచి వారంపాటు ఇటలీ, స్విట్జర్లాండ్‌ పర్యటనకు పార్థసారథి  

సాక్షి, హైదరాబాద్‌: రైతుల అభివృద్ధికి ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమని మరోసారి నిరూపణ అయిందన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులు అప్పుల ఊబినుండి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంటును 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామన్నారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకోసం భారీగా గోదాములు నిర్మించామని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలుచేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందన్నారు. తమ వెనుక ప్రభుత్వం ఉందన్న ధైర్యం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు.  

అంతర్జాతీయ సదస్సుకు పార్థసారథి 
ఐరాస ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ప్రధాన కార్యాలయం రోమ్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై ప్రసంగించేందుకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఈనెల 20న ఇక్కడినుంచి రోమ్‌ బయలుదేరనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు కూడా పర్యటిస్తారు. ఈ మేరకు పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 23వ తేదీవరకు రోమ్‌ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. తెలంగాణ విత్తన హబ్‌పైనా ఆయన మరో సదస్సులో ప్రసంగిస్తారు. 24న ఎఫ్‌ఏవో కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26–27 తేదీల్లో స్విట్జర్లాండ్‌ రాజధాని జ్యూరిచ్‌కు వెళతారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా