మిర్చీ తీసుకో.. ఓటు వేసుకో..!

18 Nov, 2018 16:34 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ: ఏడు పదుల వయస్సులోనూ మంత్రి పోచారం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు నెలల క్రితమే కంటి ఆపరేషన్, మోకాలికి శస్త్రచికిత్స చేయికున్నారు. అయినా ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం బాన్సువాడ మండలంలో పర్యటించిన ఆయన పులికుచ్చ తండాలోని ఓ హోటల్‌లో మిర్చీలు వేసి ఆకట్టుకున్నారు. అలాగే లంబాడీ మహిళల కోరికపై వారితో కలిసి నృత్యాలు చేశారు.

ఎన్నికలొచ్చే.. మర్యాద తెచ్చే..!

సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్నికలోచ్చాయి.. ఓటర్లకు ఎనలేని మర్యాదను తెచ్చిపెట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు  రెండుసార్లు చేతులెత్తి నమస్తే పెట్టినా పట్టించుకోని కొందరు నాయకులైతే ఎన్నికల పుణ్యామాని ఇప్పుడు ఓటర్లపై ఎనలేని మర్యాదను కనబరుస్తున్నారు. ఓటర్లు కంటబడగానే చేతులెత్తి వినమ్రతగా దండాలు పెట్టడంతోపాటు అన్నా.. తమ్మీ.. అక్క.. అంటూ ఆప్యాయతతో పలకరిస్తున్నారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లిన నాయకులు ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పలుపార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి చేరి వచ్చి, పోయే ఓటర్లను ప్రేమతో పలకరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశమొచ్చినా వారి వారి పార్టీల గురించి గొప్పలు చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మరణించినట్లు తెలిస్తే చాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగానే వారి ఇళ్లకు చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే గడుపుతున్నారు. వివిధ పార్టీల నాయకుల ప్రవర్తనను గమనించే కొందరు ఓటర్లు.. ఎన్నికలు ఎప్పుడూ ఇలాగే వస్తే బాగుండునని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు