60 శాతం రాష్ట్రం నుంచే...

27 Jul, 2018 01:13 IST|Sakshi
గురువారం తన నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం

దేశ విత్తన అవసరాల్లో మెజారిటీ ఇక్కడి నుంచే సరఫరా

ఇండో–జర్మన్‌ సీడ్‌ సెక్టార్‌ సమావేశంలో మంత్రి పోచారం

రాష్ట్రాన్ని ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ వరల్డ్‌’గా మార్చేందుకు కృషి

రైతుకు రూ.8 వేల పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే

ఇండో–జర్మన్‌ సేవలు మూడేళ్ల పొడిగింపునకు అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమని.. ప్రస్తుతం దేశ విత్తన అవసరాల్లో 60 శాతం రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనోత్పత్తికి ప్రాముఖ్యమిస్తూ రాష్ట్రాన్ని ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ వరల్డ్‌‘గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.

ఇండో–జర్మనీ కో–ఆపరేషన్‌ ఆన్‌ సీడ్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ కింద చేపట్టిన రెండో ప్రాజెక్టుపై గురువారం మంత్రి నివాసంలో ప్రాజెక్టు స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతులు సహజంగా కష్టపడి, నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారని, వారికి జర్మనీ దేశ సాంకేతికత తోడైతే మంచి హైబ్రిడ్‌ వంగడాలు ఉత్పత్తి అవుతాయని అభిప్రాయపడ్డారు. విత్తనోత్పత్తికి రాష్ట్రం అన్ని విధాలా అనుకూలం కావడంతో దేశ, విదేశాలకు చెందిన 400 కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు.  

రూ. 1.5 లక్షల కోట్లతో ప్రాజెక్టులు
రాష్ట్రంలో సీడ్‌ విలేజ్‌ కార్యక్రమం ద్వారా 69,950 మంది రైతులు 26,380 హెక్టార్లలో 68,000 క్వింటాళ్ల నాణ్యమైన ఫౌండేషన్‌ విత్తనాలు ఉత్పత్తి చేశారని మంత్రి చెప్పారు. గతేడాది 7 లక్షలకు పైగా క్వింటాళ్ల సర్టిఫైడ్‌ విత్తనాలను రైతుల ద్వారా ఉత్పత్తి చేయించామన్నారు.

వ్యవసాయ శాఖకు చెందిన 10 విత్తనోత్పత్తి కేంద్రాల్లో బ్రీడ్‌ సీడ్‌ను ఉత్పత్తి చేయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి యాబై లక్షల ఎకరాల సాగుభూమిలో 20 లక్షలకే సాగునీటి వసతి ఉందని, కోటి ఎకరాలకు నీరు అందించడానికి రూ.లక్షా యాబై వేల కోట్లతో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ సీఎంగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు.

పంటలకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 8 వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని జర్మనీ ప్రతినిధులకు వివరించారు. ప్రతి రైతుకు రూ. 2,271 తో రూ. 5 లక్షల ఉచిత బీమా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందన్నారు. ప్రస్తు త ఇండో–జర్మన్‌ విత్తన సహకార ఒప్పందం మరో మూడేళ్ల పొడగింపునకు భేటీలో అంగీకరించినట్లు మంత్రి తెలిపారు.  

ఈ ఏడాది 25,000 క్వింటాళ్ల లక్ష్యం
రాష్ట్రంలో విత్తనోత్పత్తి ఏటా 12.15 శాతం వృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి చెప్పారు. 2016–17లో 17,000 క్వింటాళ్ల ధ్రువీకరించిన విత్తనాలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేశామని, ఈ ఏడాది 25,000 క్వింటాళ్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

జాతీయ స్థాయిలో విత్తన నాణ్యత, ఉత్పత్తి, చట్టాలు ధ్రువీకరణ, ప్రస్తుత అవసరాలకు అనుగు ణంగా విత్తనోత్పత్తి, తెలంగాణలో విత్తనోత్పత్తికి అవకాశాలపై, మన దేశ విత్తన ధ్రువీకరణ, అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణపై రచించిన 3 పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో విత్తనాభి వృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరా వు, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్మోహన్, అగ్రికల్చర్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీ ణ్‌రావు, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ డైరెక్టర్‌ కేశ వులు, జర్మన్‌ దేశ ప్రతినిధులు ఉల్రిక్‌ క్లేయిన్‌ విచర్, నదీన్‌ కోహన్లే, ఉల్రిక్‌ ముల్లర్, ఎక్కా ర్డ్‌ శ్రోడర్‌(టీం లీడర్‌–ఇండో జర్మన్‌ కో–ఆపరేషన్‌ ప్రాజెక్టు, జర్మన్‌) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు