అలసత్వం వద్దు..

11 Oct, 2018 11:05 IST|Sakshi
హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో సమావేశమైన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: పోలింగ్‌కు రెండు నెలల సమయం ఉందని అలసత్వం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులెవరో తేలే వరకూ నియోజకవర్గంలో అన్ని అంశాలను అనుకూలంగా మా ర్చుకునేలా చూసుకోండి.. ఆయా గ్రామాల్లో పట్టున్న ఇతర పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి నాయకులను చేర్చుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించండి.. అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ లో అసంతృప్తులెవరైనా ఉంటే వారితో చర్చిం చుకుని నోటిఫికేషన్‌ వచ్చే వరకు అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూ చించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అభ్యర్థుల ప్రకటన జరిగి నెలరోజులు దాటిన నేపథ్యంలో ప్రచారం ఎంత వరకు వచ్చింది.. పోలింగ్‌కు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు.. వంటి అం శాలపై సమీక్షించుకున్నారు. ప్రచార సరళి, కార్యకర్తలకు దిశా నిర్దేశం, సభల నిర్వహణ వంటి అంశాలను చర్చించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో అనుచరులను సమన్వయం చేసుకోవాలని, రోజూవారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ పథకాలతో ఆ యా కుటుంబాలకు జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హాజరైన ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌ రూరల్‌), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూర్‌), షకీల్‌ అమేర్‌ (బోధన్‌), గంపగోవర్ధన్‌ (కామారెడ్డి), ఏనుగు రవీందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), హన్మంత్‌షిండే (జుక్కల్‌)లతో పాటు నిజామాబాద్‌ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న కోరుట్ల, జగిత్యాల అభ్యర్థులు కె.విద్యాసాగర్‌రావు, ఎం.సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు