అభివృద్ధి బాటలో.. బాన్సువాడ

4 Dec, 2018 13:06 IST|Sakshi

బాన్సువాడ నియోజకవర్గం 

అందుబాటులోకి వంద పడకల ఆస్పత్రి

వేగంగా సాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు

అపరిష్కృత సమస్యలెన్నో

వేధిస్తోన్న నిరుద్యోగ సమస్య  

సాక్ష, బాన్సువాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా వేగం పుంజుకుంది. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి బాగా కలిసొచ్చింది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన నేతల్లో ఒకరైన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖ దక్కింది. మంత్రిగా ఆయన నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సా గించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్‌ కష్టాలు తొలగిపోయేలా రూ.16 కోట్లు వెచ్చించి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు నిర్మించారు. సుమారు రూ.540 కోట్ల వ్యయంతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరోడ్ల కోసం మంజూరు చేయించారు.

నియోజకవర్గంలో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. మిషన్‌ కాకతీయ కింద రూ. 93 కోట్లతో నియోజకవర్గంలోని వందల చెరువులలో పునరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు బాన్సువాడలో వంద పడకల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేయించారు. నియోజవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నిజాంసాగర్‌ కాలువల ఆధునికీకరణ కోసం రూ.30 కోట్లు కేటాయించారు. నియోజవర్గంలోని కొల్లూర్‌ వంతెన నిర్మాణం కోసం రూ.2కోట్లతో పాటు పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 వేల డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చి రూ.25 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించారు.

అమలవుతున్న పథకాలు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు పనిముట్లు, వాహనాల పంపిణీ, యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్ల పంపిణీ

ప్రధాన సమస్యలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. స్థానికంగా భారీ పరిశ్రమలు లేవు. వర్ని నుంచి బడాపహాడ్‌ రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డును నిర్మించాల్సి ఉంది. రూ.10 కోట్లతో నిర్మించిన చందూర్‌ డీ–ఫ్లోరైడ్‌ పథకం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. మేజర్‌ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కోటగిరి, బీర్కూర్‌ మండల కేంద్రాల్లో బస్టాండ్‌ల నిర్మాణం చేపట్టలేదు. కొల్లూరు, హెగ్డోలి, సుంకినీ గ్రామాల్లో రూ.6 కోట్లతో నిర్మించి ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ చేయాల్సి ఉంది. గ్రామాల్లో శ్మాశాన వాటికల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. బీర్కూర్‌లో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయలేదు.

చేపట్టిన అభివృద్ధి పనులు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు బాన్సువాడ నియోజకవర్గంలో వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 3 వేల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే భైరాపూర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ఇంటింటికీ నీరు ఇచ్చే మిషన్‌ భగీరథ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇక, రూ.266 కోట్లతో ఆర్‌అండ్‌బీ, రూ.273 కోట్ల వ్యయంతో పంచాయతీరోడ్లు నిర్మించారు.

రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గంలో వివిధ పనులు చేపట్టారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.11 కోట్లు కేటాయించారు. అలాగే, నిజాంసాగర్‌కాలువల ఆధునికీకరణ కోసం రూ.30కోట్లు మంజూరు చేయించారు. రూ.25 కోట్ల వ్యయంతో ఫుడ్‌టెక్నాలజీతో పాటు వివిధ కళాశాలలు ఏర్పాటు చేయించారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.14.5 కోట్లు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ పనుల కోసం రూ.99.66 కోట్లు, వైద్యారోగ్య శాఖ ఆస్పత్రుల నిర్మాణంకోసం రూ.30 కోట్లు కేటాయించారు.

మొత్తం ఓటర్లు  1,73,230 
పురుషులు   83,578 
మహిళలు   89,638 
ఇతరులు   14 
ప్రస్తుత పోలింగ్‌ కేంద్రాలు  223


సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రొఫైల్‌

మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించింది. 2011లో టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం ఆ తర్వాత జరిగిన 2011, 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి 2014 వరకు ఆరు సార్లు ఎన్నికలు జరుగగా, 2009 మినహా ఐదుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఎంతో రాజకీయ అనుభవమున్న శ్రీనివాస్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాలో మంచి పట్టుంది. ప్రస్తుతం ఏడోసారి ఎన్నికల బరిలోకి దిగిన పోచారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

2014 పోల్‌గ్రాఫ్‌

పోచారం శ్రీనివాస్‌రెడ్డి 65,868
కాసుల బాల్‌రాజ్‌ 41,938 
మెజారిటీ 23,930
పోలైన ఓట్లు 1,38,854
మొత్తం ఓట్లు 1,79,416 

మరిన్ని వార్తలు