పోచారం ఏకగ్రీవం

19 Jan, 2019 02:06 IST|Sakshi
శుక్రవారం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి సభాపతి స్థానంలో కూర్చున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ రెండో శాసనసభాపతిగా శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక

బాధ్యతల స్వీకరణకు సీఎం, ఇతరుల ఆహ్వానం

స్పీకర్‌ స్థానం వరకు సాదరంగా తీసుకెళ్లిన కేసీఆర్, ఉత్తమ్, బలాల తదితరులు

ఉదయం 11: 10 గంటలకు బాధ్యతలు స్వీకరించిన పోచారం

ఆయన ఎన్నికను అభినందిస్తూ 25 మంది సభ్యుల ప్రసంగాలు

ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్షాలకు సీఎం కృతజ్ఞతలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్‌గా బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌ పదవికి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమైంది. తాత్కాలిక స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ వెంటనే తొలిరోజు ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమం కొనసాగించారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికను ప్రకటించారు. ‘తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్‌ (టీఆర్‌ఎస్‌), వి.ఎం.అబ్రహం (టీఆర్‌ఎస్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (టీఆర్‌ ఎస్‌), అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ బలాల(ఎంఐఎం), మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌) స్పీకర్‌ పదవికి శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాదించారు.

ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు’ అని ప్రకటించారు. స్పీకర్‌గా శ్రీనివాస్‌రెడ్డిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. సభానాయకుడు, ఇతర పార్టీల నేతలు కలసి ఈ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్‌ లేచి కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల వద్దకు వెళ్లి ఆహ్వానించారు. అలాగే పోచారం వద్దకు వెళ్లి చేతిలో చెయ్యి వేసి అభినందనపూర్వకంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ బలాల, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్‌ సీటు వద్దకు తోడ్కొని వెళ్లారు.

తాత్కాలిక స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఒకవైపు, కేసీఆర్‌ సహా మిగిలిన పార్టీల నేతలు మరోవైపు ఉండగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉదయం 11.10 గంటలకు స్పీకర్‌ సీటులో కూర్చున్నారు. వెంటనే పోచారం సభా నిర్వహణ ప్రారంభించారు. స్పీకర్‌ ఎన్నికపై మాట్లాడాలని సభానాయకుడైన సీఎం కేసీఆర్‌కు సూచించారు. దీంతో కేసీఆర్, మంత్రి మహమూద్‌ అలీతోపాటు కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోనిఅంశాలను సృశిస్తూ మాట్లాడారు. తెలంగాణ శాసనసభకు ఆయన గుర్తింపు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఆయన చేసిన కృషిని అభినందించారు.

ఏకగ్రీవానికి అందరూ ఒప్పుకోవడం హర్షణీయం: సీఎం కేసీఆర్‌
స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరగానే అంగీకరించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు, ఎంఐఎం అధినేత ఒవైసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు ఒప్పుకోవడం హర్షణీయం.

పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ మంత్రిగా పోచారం హయాంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ మంత్రిగా పోచారం అందించిన సేవలను నేను మరిచిపోలేను. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. పోచారం కాలుమోపిన వేళావిశేషం బాగుంది. అందుకే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయి. రైతు బంధు పథకాన్ని కాలియా అనే పేరుతో ఒడిశాలో ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలును పరిశీలిస్తున్నాయి’ అని కేసీఆర్‌ తెలిపారు.

నా కేబినెట్‌లో ఆయన లేకపోవడం లోటే...
‘ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో సింగిల్‌ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నేను అప్పుడు ఇదే పదవిలో ఉన్నాను. బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అందుకే పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడని మేము పిలుచుకుంటాం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజ్యాంగ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడంపై ఆయన సొంత ఊరు పోచారంవాసులు సంబురాలు చేసుకున్నారు.

నా కేబినెట్‌లో ఆయన లేకపోవడం ఒక విధంగా లోటే. పోచారం స్థానంలో సమర్థుడికి బాధ్యతలు అప్పగిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ పోచారం పోరాడారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి... నిజాంసాగర్‌ ఆయకట్టుకు అవినాభవ సంబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ఆయకట్టు తగ్గింది. వంద ఎకరాలు ఉన్న పోచారం ఉమ్మడి కుటుంబ పొలం ఇలాగే తగ్గింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డిదీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. ఆ కుటుంబానికి పెద్దగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు రాజ్యంగపరంగా పెద్దదైన సభాపతి పదవిని శాసనసభ పెద్దగా నిర్వహిస్తారు. శ్రీనివాస్‌రెడ్డికి వివాదరహితుడిగా పేరుంది. భగవంతుడు ఆయనకు పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలి’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఉద్యమకారుడికి దక్కిన గౌరవమిది: హరీశ్‌రావు
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే పోచారం మనస్వత్వం గొప్పదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కితాబివ్వగా వ్యవసాయ మంత్రిగా శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కొనియాడారు. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన ఈ సభలోనే తెలంగాణ ఉద్యమకారుడు స్పీకర్‌ కావడం, శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌ స్థానంలో కూర్చోవడం ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

హోంమంత్రి మొహమద్‌ అలీ, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నోములు నర్సింహయ్య, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గాదరి కిశోర్‌ కుమార్, బిగాల గణేష్‌గుప్తా, పువ్వాడ అజయ్‌ కుమార్, గంప గోవర్ధన్, హన్మంత్‌ షిండే, జాజుల సురేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్‌. రెడ్యానాయక్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ బలాల సైతం స్పీకర్‌కు అభినందనలు తెలుపుతూ మాట్లాడారు.

న్యాయబద్ధంగా వ్యవహరిస్తా: స్పీకర్‌ పోచారం
తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌గా తనను ఎన్నుకున్నందుకు శాసనసభ్యులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘శాసనసభాపతి పదవి అత్యంత కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తా.

సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తా. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా (ఎమ్మెల్యేలు) సహకరిస్తారని ఆశిస్తున్నా. అందరం కలసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. వ్యవసాయ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అని పోచారం పేర్కొన్నారు.

పోచారం చతురత...
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అభినందించే క్రమంలో కాంగ్రెస్‌ సభ్యుడు జాజుల సురేందర్‌ (ఎల్లారెడ్డి) చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే క్రమంలో పోచారం సభ్యులందరినీ నవ్వించారు. జాజుల సురేందర్‌ మాట్లాడుతూ ‘పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో స్ఫూర్తిగా నిలిచారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు సహకరించారు’ అని అన్నారు. దీనిపై పోచారం ఒకింత వివరణ ఇస్తూ అందరినీ నవ్వించారు.

‘జాజుల సురేందర్, నేను టీడీపీలో కలసి పని చేశాం. సురేందర్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయనకు టికెట్‌ వచ్చేలా నేను ప్రయత్నించా. మా ఇద్దరిదీ తండ్రీకొడకుల బంధం అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో ఆయన అలా అన్నారు. అంతేగానీ ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి నా సహకారం ఉందని కాదు’ అని అనడంతో సభ్యులందరూ నవ్వారు.

మరిన్ని వార్తలు