రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దు!

28 Jun, 2016 08:19 IST|Sakshi
రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దు!

బ్యాంకర్లకు మంత్రి పోచారం విజ్ఞప్తి
ప్రైవేటు అప్పుల నుంచి అన్నదాతలను విముక్తి చేయాలి
బ్యాంకులు ఒకే విధానాన్ని అవలంబించాలి
రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలి
బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం

 జిల్లా పరిషత్ : రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ వసూలు చేయడం బాధాకరమని, వడ్డీ డబ్బులు వసూలు చేయొద్దని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు. నాన్ లోన్ రైతులందరికీ రుణాలు ఇచ్చి ప్రైవేటు కబంధహస్తాల నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. రైతులకు పంట బీమాను వర్తింపజేసేలా వారికి అవగాహన కల్పించాలని కోరారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గతనెలలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నేటికీ జిల్లాలో లోటు వర్షపాతమే ఉందని, 126.7 మిల్లీమీటర్లకు 124.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం విత్తనాల కొరత లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రైతులు పంటలు సాగు చేసుకోవాలంటే కావాల్సింది డబ్బులు మాత్రమేనని, వాటిని రుణాల రూపంలో బ్యాంకులు ఇవ్వాలని కోరారు.

రుణాలు, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది..
జిల్లాలో 4.73 లక్షల మంది పట్టదారులు ఉంటే అందులో ఇప్పటికే 3.79 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఇంకా 94 వేల మంది పట్టాదార్లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, వారికి కూడా అప్పు లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని బ్యాంకు లు రైతుల విషయంలో ఒకే విధమైన పద్ధతిని అవలంభించాలని సూచించారు. సర్కా ర్ బ్యాంకు అధికారులకు రాష్ట్రస్థాయిలో కు దుర్చుకున్న ఒప్పందం ప్రకారం బ్యాంకు రు ణాలు, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలి పారు.

అయితే అందుకనుగుణంగా కాకుం డా కొన్ని బ్యాంకులు రైతుల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయన్నారు. లక్షలోపు రు ణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ దిశగా ఇప్పటికి రూ.200 కోట్లకుపైగా ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. కేవలం రూ.20 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. లక్షపైన రుణాలకు కేవలం సంవత్సరానికి 4 శాతం వడ్డీని మాత్రమే తీ సుకోవాలని సూచించారు. ఇంత చెప్పినప్పటికీ బ్యాంకులు వడ్డీని వసూలు చేసినట్లయి తే ప్రభుత్వం, తమల్ని అవమానించినట్లేనని అన్నారు. వీలైనంత త్వరలో రుణాలు మంజూరు చేసి సహకరించాలని కోరారు.

పంటల బీమాకు నిర్ణీత సమయంలో పంట బీమా ప్రీమియం తగ్గించడానికి సంబంధిత బీమా కంపెనీలకు ఆ మొత్తాలను చెల్లించి రైతులకు బీమా వర్తించేలా బ్యాంకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన పత్తి ైరె తులు జూన్ 14లోగా బీమా కోసం డీడీ కట్టి ఉంటే వాటిని ఆమోదించేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మూడో విడత రుణమాఫీలో సగం చెల్లించిందని, మిగతాది కూడా చెల్లిస్తుందని పేర్కొన్నారు. అలాగే రెన్యూవల్‌లో వెనకబడి ఉన్న ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్, ఇండియన్ బ్యాంకులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.

జులై 4న సమావేశం
పంటలకు బీమా వర్తింపజేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. ఈ దిశగా గ్రామం యూనిట్‌గా వర్తింపజేయడానికి అసెంబ్లీలో చర్చ జరగడం, రెండేళ్లుగా రైతుల నిరీక్షణకు ఫలితం లభించిందని అన్నారు. తద్వారా నిజామాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం పెలైట్ జిల్లాగా గుర్తించిందని తెలిపారు. వ్యవసాయానికి ఆరు రకాలుగా బీమా సదుపాయాలు ఉన్నాయని, వాటిని రైతులకు అనుకూలంగా లబ్ధి చేకూర్చడానికి అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు. జులై 4న బ్యాంకర్లతో తిరిగి సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా ఆంధ్రాబ్యాంకు మినహా మిగిలిన బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జేడీఏ నర్సింహా తెలిపారు.

ప్రభుత్వం నుంచి వడ్డీ వచ్చిన తర్వాత తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నాయని, ఇప్పటికే అలా చేసిన బ్యాంకుల వివరాలను సేకరించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల విషయంలో అవినీతి చోటుచేసుకుంటుందని, దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కోరారు. లక్ష రుణం తీసుకుంటే 80శాతం సబ్సిడీ ఉండటంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పశుసంవర్థకశాఖ అధికారులు పథకాలు, సబ్సిడీలు, తదితర విషయాలను వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ డి రాజు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఏజేసీ రాజారాం, జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్, ఇన్య్సూరెన్స్ అధికారిణి రాజేశ్వరి, ఇన్‌చార్జి ఎల్‌డీఎం వెంకటేశ్వర్లు, ఉద్యానవనశాఖ డీడీ సునంద, పశుసంవర్ధకశాఖ జేడీ ఎల్లన్న, ఏడీఏలు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు