అప్పుడు తప్పు చేసి ఇప్పుడు రోడ్డెక్కుతారా?

19 Oct, 2014 01:57 IST|Sakshi

 విపక్షాలపై మండిపడిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 నిజామాబాద్/బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలకు గతంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన నిజామాబాద్, బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పిడికెడు బొగ్గులేని రాయలసీమలో థర్మల్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి, బొగ్గు నిల్వలు ఉన్న  తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించడం వల్లనే రాష్ర్టంలో కరెంటు సరఫరాకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అప్పుడు తప్పు చేసిన ఆ రెండు పార్టీలే నేడు కరెంటు కోసం రోడ్డెక్కి ఆందోళన చేయడం సిగ్గుచేటని విమర్శించారు.  కరెంటు కోతలను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. పంటల నష్టంపై సర్వే చేయిస్తామని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి 75 శాతం కాకుండా 25 శాతం మాత్రమే లెవీ బియ్యం సేకరిస్తోందన్నారు.
 

మరిన్ని వార్తలు