పోడు పోరు.. శిక్ష ఖరారు..! 

24 Aug, 2019 12:36 IST|Sakshi
పోడుదారులు, అటవీ శాఖాధికారులు పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యం (ఫైల్‌)

2015 దాడి ఘటనపై వెలువడిన తీర్పు 

నాలుగేళ్ల తరువాత 24 మందికి జైలు శిక్ష 

అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటన 

జిల్లా వ్యాప్తంగా పోడు సాగుదారుల్లో ఆందోళన 

సాక్షి, ఖమ్మం : పోడు సాగుదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2015లో ప్రారంభించిన తొలి విడత హరితహారం నుంచి అటవీశాఖ అధికారులు, పోడుసాగుదారుల మధ్య చోటుచేసుకుంటున్న ఘర్షణలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ప్రతి హరితహారం సమయంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ముందస్తుగా కందకాలు తీసే క్రమంలో పోడు సాగుదారులు తిరగబడటం పరిపాటిగా మారింది.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీని విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లాలో అటవీశాఖ మహిళా అధికారిపై జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేసింది. అటవీశాఖ అధికారులు సైతం ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. జిల్లాలో సైతం కొత్తగూడెం, ముల్కలపల్లి మండలాల్లో ఇటీవల వరుస పోడు దాడులు చోటుచేసుకున్నాయి. ఏటా హరితహారం సీజన్‌లో పోడు సాగుదారులకు అటవీశాఖ అధికారులకు ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం పరిపాటిగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే 2015లో జరిగిన పోడు దాడి ఘటన విషయంలో పలువురికి జైలు శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 24 మంది పోడుసాగుదారులపై ఏడాది జైలు శిక్ష ఖరారు కావడంతో ఒకింత వారిలో ఆందోళన నెలకొంది. 

అప్పట్లో సంచలనం..  
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో తొలిసారిగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015 మార్చి 9న కొత్తగూడెం డివిజన్‌ రామవరం రేంజ్‌ పరిధిలోని చండ్రుగొండ మండలం అబ్బుగూడెం, మర్రిగూడెం, సీతాయిగూడెం ప్రాంతాల్లో అటవీశాఖాధికారులు మొక్కలు నాటేందుకు ముందస్తు కందకాలు తీసే క్రమంలో పోడు సాగుదారులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. పరిసర గ్రామాలకు చెందిన దాదాపు వందకు పైగా పోడు గిరిజన సాగుదారులు, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అధికారులపై కర్రలు, రాళ్లతో ఎదురుదాడి చేశారు.

ఆ దాడి నేపథ్యంలో పోడు భూముల్లో రక్తం చిందింది. ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకోవడానికి పోడుసాగు దారులు తీవ్రంగా ప్రతిఘటించి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో అటవీశాఖ అధికారులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడమే కాకుండా అసెంబ్లీలో సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు చండ్రుగొండ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పట్లో అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్సై జి.రవీందర్‌ విచారణ నిర్వహించి దాడికి పాల్పడిన 24 మందిపై కేసు నమోదు చేశారు.  

24 మందికి శిక్ష ఖరారు 
అక్రమంగా ప్రభుత్వ అటవీ భూముల్లోకి పోడు సాగుదాడులు ప్రవేశించడమే కాకుండా, విధి నిర్వాహణలో ఉన్న పలువురు అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడటాన్ని నేరంగా భావించి కొత్తగూడెం కోర్టు 24 మందికి జైలు శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో పోడు ఘర్షణల నేపథ్యంలో సాగుదారులపై పెద్దఎత్తున శిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం. ఈ కేసు విషయంలో 24 మందికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.700 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఏడాది జైలు శిక్ష పడిన వారిలో ఎస్‌.కె ఉమర్, కాకా మహేశ్, కాలంగి రంగా, జంగిలి వెంకటరత్నం, నుందురి సూర్యప్రకాశ్, భాగ్యలక్ష్మి, కృష్ణకుమారి, సత్యనారాయణ, యాలాద్రి, మంగయ్య, భిక్షం, శ్రీను, రాము, వెంకటి, పద్మ, వీరభద్రం, ధనమ్మ, వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కన్నయ్య, హరీశ్, గోపాల్‌రావు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు చోటుచేసుకున్న పోడు దాడుల విషయంలో 270 కేసులు నమోదయ్యాయి. తాజా తీర్పుతో దశాబ్దాలుగా జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పోడుసాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఒకింత భయాందోళన మొదలైంది.  

జఠిలంగా పోడు సమస్య 
జిల్లాలో పోడు సమస్య కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా తయారైంది. జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజన ప్రజలు అనేక ఏళ్లుగా ఈ పోడు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5.80 లక్షల హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. దీనిలో దాదాపుగా 1.25 లక్షల హెక్టార్ల భూమిని పోడుసాగుదారులు ఆక్రమించి అనేక ఏళ్లుగా పోడుకొట్టుకొని భూమి సాగుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2.05 లక్షల మంది పోడుసాగుదారులు పోడు భూములను సాగుచేస్తున్నట్లు అంచనా.

ఇక కొత్తగూడెం జిల్లాలో 4,33,466 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. అటవీ అధికారుల లెక్కల ప్రకారం 2005 నుంచి 2018 వరకు 90,120 హెక్టార్లు ఆక్రమణకు గురైంది. ఇక పోడు భూముల పేరిట గిరిజనేతరుల ఆక్రమణలో 33,848 హెక్టార్ల భూములున్నాయి. అయితే 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం అంతకుముందు భూమిని సాగు చేసుకుంటున్న అనేక మంది పోడు గిరిజనులు పట్టాలివ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకొని జిల్లాలో దాదాపు 95 వేల ఎకరాలకు 30,779 హక్కు పత్రాలు అందజేశారు. ఆ తరువాత మరికొందరివి పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగిలిన భూములకు పట్టాలివ్వాలని పోడుసాగుదారులు అనేక ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.  

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి 
రాష్ట్ర ప్రభుత్వం పోడుసాగుదారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారికి అండగా నిలవాలి. న్యాయపరంగా పట్టాలిస్తామని చెప్పిన సర్కారు అక్రమ కేసులను పెట్టి గిరిజనులను ఇబ్బందులు పెడుతోంది. 2015లో జరిగిన పోడు ఘర్షణలో 24 మందిపై కోర్టు ఇచ్చిన జైలు శిక్ష తీర్పు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని సుమోటోగా స్వీకరించాలి. శిక్ష పడిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.  -మచ్చా వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు 

అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం 
అటవీ భూములను ఆక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తాం. ఎలాంటి ఆధారాలు లేకుండా భూములపైకి వెళ్తే చర్యలు తప్పవు. అక్రమంగా అటవీ భూముల్లోకి వెళ్లి అధికారులపై దాడి చేసిన ఘటనలో తీర్పు కఠినంగా వెలువడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అటవీ భూముల జోలికి వస్తే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం.
శివాల రాంబాబు, జిల్లా అటవీశాఖాధికారి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..

పట్టపగలే దోచేశారు

సిఫార్సు ఉంటేనే సీటు!

మలిదశ పోరుకు సన్నద్ధం

డెంగీ కౌంటర్లు

పటేల్‌ తరహాలో మోదీ సక్సెస్‌ అయ్యారు

భయం..భయం

‘పీక్‌’ దోపిడీ!

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే

కార్డు కష్టాలు

వెంబడించి కారుతో ఢీకొట్టి.. వ్యక్తి దారుణ హత్య

ఒక్కరోజే.. 6 లక్షల మొక్కల పంపిణీ

26, 27న నీళ్లు బంద్‌

అరుదైన మూలికలు@సంతబజార్‌

బీజేపీ నేత కుమారుడు లండన్‌లో మిస్సింగ్‌

ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కావాలి

అక్కడా.. ఇక్కడా కుదరదు

గాఢ నిద్రలో ఉండగా ముగ్గురిని కాటేసిన కట్లపాము

నగరంలో ఫ్లెమింగోల సందడి

హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి

నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు 

‘ఆ గ్రామాల్లో మల్లన్నసాగర్‌ పనులు ఆపేయండి’ 

తల ఒకచోట.. మొండెం మరోచోట 

సీబీఐ విచారణకు సిద్ధం! 

టీఆర్‌ఎస్‌దే బోగస్‌ సభ్యత్వం: లక్ష్మణ్‌ 

వాంటెడ్‌.. శవాలు!

గులియన్‌ బరి డేంజర్‌ మరి

ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషిచేస్తా

హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

బల్గేరియా వెళ్లారయా

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

యాక్షన్‌ రాజా