కళాకారులది నిర్మాణాత్మక పాత్ర

8 Jun, 2015 01:26 IST|Sakshi
కళాకారులది నిర్మాణాత్మక పాత్ర

- రవీంద్రభారతిలో కవి సమ్మేళనం
- కొత్తసాలు పుస్తకావిష్కరణ
నాంపల్లి:
తెలంగాణలో కవులు, కళాకారులు, రచయితలకు కొదవ లేదని, చరిత్రలో వారునిర్మాణాత్మకమైన పాత్రలను పోషించారని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతి వేదికపై రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చెందిన 400 మంది కవులతో  కవి సమ్మేళనం నిర్వహించారు. పద్య, వచన కవులతో పాటు ఆశు కవులు కూడా భాగస్వాములై సదస్సును విజయవంతం చేశారు. తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా చాటుతూ ప్రతి భను కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, జాతీయ సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కవి సమ్మేళనాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య నేపథ్యాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం కవి సమ్మేళనాలు దోహదపడుతాయన్నారు.  ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యమనేత రాష్ట్ర పాలకుడైతే రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఎంత అలరారుతుందో సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాల నిర్వాహణ ద్వారా నిరూపించారని అన్నారు. ఆచార్య ఎన్.గోపి తొలి కవితను వినిపించి కవి సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. కవి ఆచార్య అనుమాండ్ల భూమయ్య పద్య గానంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్న చందాన నిర్వహించామని అందుకు సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమ్మేళనం విజయవంతమైన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, జూలూరి గౌరీ శంకర్, తూర్పు మల్లారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, జూపాక సుభద్ర తదితరులు అధ్యక్షత వహించారు. అనువాద కవులను  రాష్ట్ర సాంస్కృతిక శాఖ పక్షాన ఘనంగా సత్కరించారు. తొలుత రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవంలో పాల్గొన్న కవులు అందించిన కవిత్వాలతో పొందుపరిచిన ‘కొత్తసాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు