‘పుట్ట’ పగిలింది..

6 Feb, 2019 10:00 IST|Sakshi

నగరంలో పెరుగుతోన్న విషసర్పాల సంఖ్య..

విషరహిత పాముల మనుగడ ప్రశ్నార్థకం..

పాముల జాగాల్లో ఇళ్ల నిర్మాణమే కారణం..

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరంలో విస్తరిస్తోన్న కాంక్రీట్‌ మహారణ్యాలు..చెట్ల నరికివేత..బ్లాస్టింగ్‌..ఇతర అభివృద్ధి ప్రక్రియలతో ఒకవైపు మానవాళికి, ఇతర జంతువులకు హానితలపెట్టని విషరహిత పాముల సంఖ్య తగ్గుతుండగా...మరోవైపు విషసర్పాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా.. ఆకుపచ్చని చెట్లతో ఉండే హరిత వాతావరణం, సహజసిద్ధమైన కొండలు, చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాల్లో ఇటీవలికాలంలో అవన్నీ కనుమరుగై బహుళ అంతస్తుల భవంతులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు వెలుస్తుండడంతో పాముల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాదిగా ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యుల పరిశీలనలో తేలిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

పాముల జాగాలో ఇళ్లు...!
పాముపుట్టలో వేలు పెడితే అనర్థాలు తప్పవు అన్న చందంగా మారింది గ్రేటర్‌లో పరిస్థితి. ఒకప్పుడు వైవిధ్యభరితమైన పాములు మనుగడ సాగించిన ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల భవంతులు వెలుస్తుండడంతో పాముల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి. దీంతో విభిన్న జాతులకు చెందిన సర్పజాతులు క్రమంగా అంతర్థానమౌతున్నాయి. కాలక్రమేణా నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులు ,ప్రభుత్వస్థలాలు కబ్జాకు గురవుతుండడం ఆయా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమౌతోంది.

ఖాళీ ప్రదేశాలే విషసర్పాలకు నిలయాలు....
ప్రధానంగా ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తోపాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, నెక్నాంపూర్‌ తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో విషసర్పాలైన నాగుపాములు, స్పెక్టకిల్డ్‌ కోబ్రా, రస్సెల్‌వైపర్, కామన్‌ కైరాట్, స్కా స్కేల్డ్‌ వైపర్‌ వంటి విషసర్పాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో స్థానికులు తడి, పొడిచెత్త, కూరగాయల వంటి వ్యర్థాలను పెద్ద మొత్తంలో డంపింగ్‌ చేస్తుండడంతో ఈ జాగాల్లో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సర్పాల సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం. గతేడాదిగా నగరానికి చెందిన ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ అటవీశాఖ సౌజన్యంతో సుమారు 6 వేల సర్పాలను పట్టుకోగా..ఇందులో 3 వేల వరకు నగరంలోనే పట్టుకోవడం గమనార్హం. ఇందులోనూ 70 శాతం వరకు విషసర్పాలే ఉన్నట్లు స్నేక్‌ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు.   

విషరహిత పాముల మనుగడప్రశ్నార్థకం..
నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం కొండలను సైతం తొలచివేస్తుండడం..ఈ క్రమంలో బ్లాస్టింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో విషరహిత సర్పాలుగా పేరొందిన రాకీ పైథాన్,బఫ్‌ స్ట్రైప్డ్‌ కీల్‌బ్యాక్‌ తదితర సర్ప జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్నేక్‌ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. తమకు నిత్యంఇళ్లు, కార్యాలయాలు, ఖాళీప్రదేశాల్లోని పాములను పట్టుకోవాలని కోరుతూ వందకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాము అటవీశాఖ సిబ్బంది సౌజన్యంతో పాములను పట్టుకొని వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా అడవుల్లో తిరిగి వదిలిపెడుతున్నట్లు వారు వివరించారు.

మరిన్ని వార్తలు