మా వాళ్లు.. మీ వాళ్లే కరోనాతో స'పరివార్‌'

10 Apr, 2020 11:49 IST|Sakshi

శతకోటి వందనాలతో.. మీకే అంకితం

కోవిడ్‌ సైన్యం కుటుంబ సభ్యుల మనోగతమిది..

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న వేళ అందరిలోనూ భయం నెలకొంది. ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ సోకుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది అసమాన సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఎనలేని అంకితభావం చూపుతున్నారు. మరి వీరి గురించి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న తమ వారి గురించి ఏం చెబుతున్నారు? విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన వారిని చూసి ఎలా స్పందిస్తున్నారు? నగరంలోని పలు ప్రాంతాల్లో కరోనా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది కుటుంబాలను ‘సాక్షి’ పలకరించింది. వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయగా...ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. కరోనా బాధితులకు సేవలందించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

డాక్టర్‌ ది గ్రేట్‌..మేం ఆయనకు సేవ చేస్తున్నాం
కరోనా వైరస్‌ వ్యాపిస్తుండటంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా బాలానగర్‌ ప్రభుత్వ డాక్టర్‌గా నా భర్త చందర్‌ రోజూ విధులకు హాజరవుతూ ప్రజలకు చికిత్సలు అందిస్తున్నారు. ఇది మాకెంతో గర్వంగా ఉంది. కుటుంబ సభ్యులంతా ఆయనకు చేయూత అందిస్తున్నాం. ఇంట్లో ఆయనకు అన్ని సేవలు చేస్తున్నాం. ఇటువంటి సమయంలో ఆయనకు సేవలు చేయటం మాకెంతో ఆనందం కలుగుతోంది. 
– హేమ, బాలానగర్‌


నర్సు.. ది నైటింగేల్‌... మదర్‌ థెరిసాలా సేవలు  
మా అమ్మ పేరు రజని. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో హెడ్‌ నర్స్‌. ఇక్కడ కోవిడ్‌ లెవల్‌–1 రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. కొన్నేళ్లుగా అమ్మ రోగులకు వైద్యసేవలు చేస్తున్నారు. ఇటీవల కరోనా వార్డులో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. మదర్‌ థెరిసాలా ఆమె నిరంతరం రోగులకు వైద్యసేవలు అందించడం మాకెంతో గర్వకారణం. కుటుంబానికి దూరంగా ఉన్నా సేవ చేస్తున్నందుకు సంతోషం. 
- అలేఖ్య, రజనీ సిస్టర్‌ కుమార్తె

పోలీస్‌.. సెల్యూట్‌ --- మా నాన్నను చూస్తే గర్వంగా ఉంది
మా నాన్న రవియాదవ్‌ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రాత్రికి ఏ సమయానికి ఇంటికి వచ్చినా మమ్మల్ని దూరంగా ఉంచి స్నానం చేసిన తర్వాతే దగ్గరకు వస్తున్నాడు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ఈ సమయంలో పోలీసు విభాగంలో పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు నా సెల్యూట్‌..
– జశ్వంత్‌కుమార్‌ యాదవ్, మల్కాజిగిరి

క్లీన్‌.. క్వీన్స్‌ మా అత్త గ్రేట్‌  
మా అత్త చంద్రమ్మ జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికురాలు. మమల్ని ఎంతో బాగా చూసుకుంటది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆమె పారిశుధ్య విధులు నిర్వహిస్తోంది. మేమంతా  ఆందోళన చెందుతున్నా ఆమె ధైర్యంగా విధులకు హాజరుకావటంతో అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నాం. కష్టకాలంలో ప్రజలకు సేవ చేస్తుండటంతో మాకు ఎంతో ఆనందం కలుగుతోంది. 
– చిరుమర్తి సుమలత, కూకట్‌పల్లి

ఆరోగ్యం సహకరించకున్నా డ్యూటీకి..
మా బాబు ఉప్పల్‌లో శానిటరీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పుడు 55 సంవత్సరాలు.. 16 సంవత్సరాల నుంచి డయాబెటిక్‌ పేషేంట్‌.. అయినా కరోనా నుంచి ప్రజలను, సమాజాన్ని కాపాడేందుకు నడుం కట్టాడు. తిరిగి వచ్చే వరకు ఇంట్లో వారమంతా టెన్షన్‌ పడుతుంటాం. సెలవులు పెట్టమని అడిగాం..  ఉద్యోగం పోయినా పర్వాలేదు అన్నాం.. ఆరోగ్యం సహకరించకపోయినా ఉద్యోగానికి వెళ్తున్నాడు. 
భారతి, ఉప్పల్‌

బెంగతో ఉంటున్నాం..
మా నాన్న పోలీస్‌ కానిస్టేబుల్‌. లాక్‌డౌన్‌లో సమయంలోనూ విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్లపై డ్యూటీ కారణంగా కరోనా సోకుతుందేమోనని అని భయం వేస్తోంది. చాలా రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. నాకు బాధ వేస్తోంది. కరోనా రాకుండా మా నాన్న కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు. ప్రజలందరి కోసం మా నాన్న కష్టపడి డ్యూటీ చేస్తున్నాడు. నేను కూడా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకుంటున్నాను.     
– సుమన, పోలీస్‌ కానిస్టేబుల్‌ కుమార్తె

నాన్నను చూడాలని ఉంది
నాన్నను చూసి చాలా రోజులైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ విధించడంతో మా నాన్న షాహినాజ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో డ్యూటీలోనే ఉంటున్నాడు. ఇంటికి కూడా రావడం లేదు. ప్రజలు రోడ్లపైకి రాకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజూ ప్రజల కోసమే కష్టపడుతున్నాడు. కరోనా వైరస్‌ గురించి వింటుంటే భయం వేస్తోంది. మా నాన్న చాలా గ్రేట్‌..
– సన్నీ, కుల్సుంపురా పోలీస్‌ క్వార్టర్స్‌

కరోనా యుద్ధంలో సైనికురాలిగా..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశం చేస్తున్న యుద్ధంలో మా అమ్మ పాల్గొంటున్నందుకు సంతోషం. మా అమ్మ హేమలత లాలాపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. 20 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇంటిని పట్టించుకోకుండా కేవలం వైద్య సేవలు అందిస్తోంది. దీనికి కుటుంబ సభ్యులుగా తాము ఆమెకు సహకరిస్తున్నాం. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి. 
– సోనియా, లాలాపేట

ప్రాణాలు లెక్క చేయకుండా..
నా కొడుకు పోలీస్‌ అయినందుకు గర్వంగా ఉంది. ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పోలీస్‌ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న ఆయా బృందాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి.  
– సంధ్యారాణి, కుర్మగూడ

నాన్న కోసమే ఇక్కడ ఉన్నాం..
మా నాన్న ఉప్పల్‌ పీహెచ్‌సీలో హెల్త్‌ ఆఫీసర్‌. మొదట్లో భయపడ్డాం.. మా నాన్న డయాబెటిక్‌ పేషెంట్‌.. అందరూ భయంతో దూరంగా ఉంటే మా నాన్నేమో ప్రతిరోజూ అనుమానితులను గుర్తించడం, ట్రావెలర్స్‌ను కలవడం మాకు ఎంతో కలవరంగా ఉంది. అందరి నాన్నలు ఇంట్లో కుటుంబ సమేతంగా గడుపుతున్నారు.  కానీ మాకు ఆ పరిస్థితి లేదు. నాన్న కోసమే ఇక్కడ ఉన్నాం.. లేకుంటే ఊరుకు వెళ్లే వాళ్లం.
– అమానుల్లా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఉప్పల్‌

నా భార్యను చూసి గర్వపడుతున్నా..
ఊహించని పరిణామాలతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కానీ ఇలాంటి సందర్భాల్లోనే మనో ధైర్యంతో విధులు నిర్వహించాల్సిన అసవరం ఉంది. నా భార్య అమృత షాపూర్‌నగర్‌లో నర్సుగా అందిస్తున్న సేవల పట్ల  మాకు కొంచెం ఆందోళన ఉన్నా అదే సందర్భంలో బాధ్యతగా సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. కరోనా వైరస్‌పై నా భార్యతో పాటు పోరాడుతున్న వారందరికీ సెల్యూట్‌.  
– లక్ష్మయ్య  

గర్వంగా ఉంది  
మా నాన్న గోపాల్‌ గోల్కొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌. నిత్యం ఆయన సేవలు చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాను. మా కుటుంబ సభ్యులతో పాటు అమ్మ, నానమ్మలు కూడా మా నాన్నకు నైతిక మద్దతు ఇస్తూ మా నాన్న వృత్తి ధర్మం నిర్వహించేలా చూస్తున్నాం. మానవ సేవకు మించింది మరేది లేదని మా డాడీ ఎప్పుడూ చెప్తారు. ఆయన విరామం లేకుండా పనిచేస్తూ తాను చెప్పిన దాన్ని చేసి చూపిస్తున్నారు.     
– ఎం.స్నిగ్ధా

ఐ లవ్‌ మై డాడ్‌..
మా నాన్న విజయ్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19లో శానిటరీ సూపర్‌వైజర్‌. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మా నాన్నగారిని చూస్తుంటే నాకెంతో గర్వకారణంగా ఉంది. విపత్కర సమయంలో భయపడకండి, అండగా మేమున్నాం.. అంటున్నారు. నాన్న విధుల్లో భాగంగా కుటుంబానికి చాలా దూరం అవుతున్నారు. అయినా మాకు బాధలేదు. ప్రజల ఆరోగ్యమే నా అరోగ్యం అని అంటున్నారు. ఐ లవ్‌ మై డాడ్‌.
– ఎం.జయదేవ్‌

జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ప్రస్తుతం ప్రజలంతా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం అయినా నా భర్త పోలీస్‌ డిపార్టుమెంట్‌లో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా నిత్యం భయపడుతున్నాం. కష్ట సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు బయటకు రాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలి.
– రాధిక, కాప్రా  

డాడీని మిస్స్‌ అవుతున్నాను
మా డాడీ రాజ వర్ధన్‌ పిడియాట్రిషియన్‌. ఆయనను నేను మిస్‌ అవుతున్నాను. ప్రతిరోజూ సాయంత్రం డాడీతో కొద్దిసేపు మాట్లాడి ఆడుకునేవాడిని.. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో మూడు వారాలుగా డాడీతో  మాట్లాడలేకపోతున్నాను. అత్యవసర పరిస్థితుల్లో డాడీ డ్యూటీకి వెళ్తున్నారని, కరోనా వ్యాప్తి అరికట్టడానికి సామాజిక దూరాన్ని పాటించాలని అమ్మ చెప్పింది. నాన్న ఇంటికి వచ్చినా దూరంగా ఉంటున్నాను. 
– కె.వైభవ్‌ వర్ధన్‌

మా ఆయన కృషిని ప్రోత్సహిస్తున్నాం
ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. వచ్చినా అలా బయట నుంచి వెళ్లిపోవడమే.. కరోనాతో అందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న నా భర్త బేగంపేట ఎస్‌ఐ ముత్యంరాజు మాత్రం డ్యూటీలో భాగం కావడం గర్వంగా ఉంది. ప్రజల ఆరోగ్యం కాపాడే క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయన కృషికి మా ప్రోత్సాహం ఉంటుంది.     – మేఘమాల

అమ్మతో సరదాగా గడపలేక..
అమ్మ దగ్గరకు కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ –16 ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌గా అమ్మ హేమలత విధులు నిర్వర్తిస్తోంది. ఉదయం 7 గంటలకు అమ్మ ఇంట్లో నుంచి వెళితే రాత్రి ఏ సమయంలో వస్తుందో చెప్పలేని పరిస్థితి. కరోనా సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నాం. సాధారణంగా సెలవు రోజుల్లో అమ్మతో సరదాగా గడుపుతాం. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.  – నైత్రి, నైచిత్, అంబర్‌పేట

గర్వంగా ఉంది..
మా నాన్న జీహెచ్‌ఎంసీలో చాంద్రాయణగుట్ట డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నిత్యం వి«ధులకు వెళుతున్నాడు. చాంద్రాయణగుట్టలో కరోనా ప్రబలి కొన్ని లొకేషన్లను దిగ్భందంగా మార్చుతున్న తరుణంలో కూడా విధి నిర్వహణ చేస్తుండడం గర్వంగా ఉంది. మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు శానిటైజర్‌తో పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంట్లో భౌతిక దూరం పాటిస్తున్నాం.    – విక్రాంత్‌ సాయి, జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కుమారుడు   

నా భర్త ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. నా భర్త శ్రీనివాస్‌ శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 5గంటలకు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తున్నారు. భయం వేస్తుంది.. డ్యూటీ లేకున్నా పర్వాలేదనిపిస్తుంది. కానీ అందరూ అలాగే అనుకుంటే ఎలా? ప్రజలకు సేవ చేసేందుకు ఇదో అవకాశం. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా.     – నిర్మల, బేగంపేట

55 ఏళ్లు దాటితే సెలవులు ఇవ్వాలి
మా అమ్మ సాలమ్మ జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగంలో పనిచేస్తోంది. నిత్యం ఉదయాన్నే విధులకు హాజరవుతోంది. రెండు రోజులకు ఓసారి అధికారులు మాస్కులు అందజేస్తున్నారు. ఆమె విధులకు హాజరై ఇళ్లకు వస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా భయపడుతున్నాం. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు మాస్కులు, శైనిటైజర్స్, గ్లౌజులు అందజేయాలి. 55 ఏళ్లు దాటిన ఉద్యోగులకు సెలవులు ఇస్తే బాగుంటుంది.  – మహేష్‌  

భయం వెంటాడుతోంది.. అయినా..
నా భర్త కిరణ్‌ కుమార్‌ రెడ్డి శేరిలింగంపల్లి సర్కిల్‌లో శానిటేషన్‌ విభాగంలో ఎస్‌ఆర్‌పీ. తెల్లవారు జాము నుంచే పారిశుద్ధ్యం పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్యం పనుల పర్యవేక్షణ చేయడం గర్వంగా ఉంది. ఇప్పుడే ప్రజలకు నిజమైన సేవ అందిస్తున్నారనే భావన కల్గుతోంది. కరోనా పేరు వింటేనే భయం వేస్తోంది. అయినా నా భర్త డ్యూటీ చేసేందుకు సహకరిస్తున్నాం.     – ఇ.సంతోషి, చందానగర్‌

పొద్దున వెళ్లి.. రాత్రి ఇంటికి..
నా భర్త ఎస్‌ఆర్‌పీ కనక రాజు ఎస్‌ఆర్‌పీ. పొద్దున వెళితే రాత్రికి ఎప్పుడో వస్తున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని చెప్పినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలను అమ్మమ్మవాళ్ల ఇంటికి పంపించాం. లాక్‌డౌన్‌తో వారిని వెళ్లి కలిసే పరిస్థితి కూడా లేదు. వాట్సాప్‌ వీడియో కాల్‌లో మాట్లాడుకుంటున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆందోళన వెంటాడుతోంది. అయినా అతడికి సహకరిస్తూనే ఉన్నాం. – మంజుల, చందానగర్‌

పోలీసులకు రక్షణ æకల్పించాలి  
లాక్‌డౌన్‌ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రక్షణ కల్పించాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వైద్య బృందంతోపాటు పోలీసులు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. కొందరు పనిగట్టుకుని వారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసేలా ప్రభుత్వం చట్టాలను సవరించాలి.   – కరుణ సాగర్, న్యాయవాది, కుర్మగూడ

భయంగా ఉంది  
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ మా నాన్న మహమ్మద్‌ ఉస్మాన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించడం భయంగా ఉంటోంది. 24 గంటల పాటు విధులు కొనసాగించడం వల్ల కరోనా వైరస్‌ అంటుకుంటుందేమోనని భయంగా ఉంటోంది. ఒక రకంగా గర్వంగా ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వల్ల భయపడుతున్నాం. కరోనాపై పోరాటంలో నాన్న కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.– మహమ్మద్‌ గౌస్, కుల్సుంపురా 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు